● మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం
శ్రీశైలంటెంపుల్: శ్రీగిరిపై శ్రావణమాసోత్సవ రద్దీ నెలకొంది. శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. శ్రావణమాస మొదటి ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. సామాన్య భక్తుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం వీఐపీ బ్రేక్ (స్పర్శ) దర్శనాలు రద్దు చేశారు. కేవలం రాత్రి వేళలలో మాత్రమే స్పర్శదర్శనాలకు అవకాశం కల్పించారు. సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లపై దేవస్థాన ఈఓ పరిశీలించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకలలాడాయి.
భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలం: వరుస సెలవు రోజులు రావడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానిక టోల్‌గేట్, నంది సర్కిల్, సాక్షి గణపతి, హాటకేశ్వరం, ముఖద్వారం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. కేవలం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి సుమారు గంటపాటు వాహనదారులు నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు ఆత్మకూర్ డీఎస్పీ రామాంజి నాయక్, వన్‌టౌన్ సీఐ జీవన్ గంగానాథ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. మధ్యాహ్నం తర్వాత ట్రాఫిక్ క్లియర్ కావడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి.


