డోన్: నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ శ్రీనివాసులుకు జాతీయ స్థాయిలో ఇండియన్ పోలీస్ మెడల్(ఐపీఎం)ను కేంద్రం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో జరిగిన వేడకల్లో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీనివాసులుకు మెడల్‌ను ప్రదానం చేశారు. డీఎస్పీ ఐపీఎంకు ఎంపిక కావడంపై ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ సప్తశైల రాజేష్, మాజీ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, వైఎస్సార్‌సీపీ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
గోరుకల్లులో 4 టీఎంసీల నీరు
పాణ్యం: గోరుకల్లు జలాశయంలో 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి శనివారం ఇన్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులు ఉందని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాగునీటి అవసరాల నిమిత్తం నీరు నిల్వ చేస్తున్నట్లు తెలిపారు.
సాంబగల్లులో
చిరుత సంచారం
ఆదోని: మండలంలోని సాంబగల్లు గ్రామంలో చిరుత సంచారం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొంతమంది రైతులు ఉదయం పొలాల పనులకు వెళ్లిన సమయంలో చిరుతను చూసి గ్రామంలో తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై అటవీశాఖ బీట్ ఆఫీసర్ సైఫుల్లాను వివరణ కోరగా... ఈ విషయం తమదృష్టికి రాలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బాలుడి ప్రాణం తీసిన విద్యుదాఘాతం
ఆలూరు రూరల్: విద్యుదాఘాతంతో మల్లికార్జున (12) అనే బాలుడు మృతి చెందాడు. మనేకుర్తి గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బోయ ఈరన్న ఇంటి ముందు ఉన్న మహేంద్ర ఇంట్లో పెళ్లి వేడుకల కోసం ఇనుప పైపులకు విద్యుత్ లైట్లతో డెకరేషన్ చేశారు. బాలుడు మల్లికార్జున షామియానా పైపులను అనుకోవడంతో విద్యుత్ షాకై అక్కడిక్కడే మృతి చెందాడు. ఈరన్న, సరస్వతి దంపతుల మొదటి కుమారు మల్లికార్జున కమ్మరచేడు గ్రామంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
గంజాయి మత్తులో పట్టుబడిన యువకులు
రీహాబిటేషన్ సెంటర్‌కు తరలింపు
ఎమ్మిగనూరురూరల్: గంజాయి సేవించి పట్టుబడిన యువకులను విశాఖపట్టణంలోని రీహా బిటేషన్ సెంటర్‌కు పంపినట్లు పట్టణ సీఐ కంబగిరి రాముడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో గంజాయిని అరికట్టడంతో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఐదుగురు వ్యక్తులను కిట్ ద్వారా పరీక్షించగా గంజాయి తీసుకున్నట్లు నిర్థారణ కావడంతో విశాఖపట్న ంలోని గ్రీన్ వ్యాలూ ఫౌండేసన్ ( రీహాబిటేషన్ సెంటర్) పునరావాస కేంద్రానికి పంపామన్నారు. మీ ప్రాంతాల్లో యువకులు గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాచారం తెలిస్తే టౌన్ సీఐ–91211 01147, టౌన్ ఎస్‌ఐ–91211 01145 నెంబర్లకు తెలియజేయాన్నారు.
హెబ్బటంలో
మొసలి కలకలం
హొళగుంద: మండల పరిధిలోని హెబ్బటం గ్రామ సమీపంలో మొసలి సంచారం కలకల రేపింది. గ్రామం పక్కన ఉన్న మంచి నీటీ పథకం పరిసరాలో శుక్రవారం మొసలి సంచరించినట్లు గ్రామస్తులు శనివారం తెలిపారు. ఎల్లెల్సీ నుంచి మంచినీటి పథకానికి నీటి సరఫరా జరిగే పంప్ హౌస్ వద్ద మొసలిని కనుగొన్నట్లు చెప్పారు. ఇటీవల కాలువకు నీటి సరఫర జరిగిన సమయంలో కొట్టుకొచ్చిన మొసలి మంచినీటి పథకం వద్ద చేరిఉంటుందని చెబుతున్నారు. ఎవరూ ఆ ప్రాంతంలో తిరగవద్దని, అప్రమత్తంగా ఉండాలని చేస్తున్న హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంబందిత అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.


