కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు ఉచితంగా విత్తన కాయలను పంపిణీ చేసి వేరుశనగ సాగును ప్రోత్సహించాల్సిన వ్యవసాయ అధికారులు లోపాయికారిగా అమ్ముకోవడం దారుణమని, దీనికి పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగన్నాథం డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘సబ్సిడీ వేరుశనగలో ‘విశిష్ట’ దోపిడీ’ శీర్షికతో వార్తా కథనం ప్రచరితమైంది. దీనిపై సమగ్రంగా విచారణ జరుపాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కాగా అంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, నాయకులు రాముడు, మహబూబ్‌బాషా తదితరులు వేరుశనగను దారి మల్లించడంపై జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. డీఏఓ అందుబాటులో లేకపోవడంతో అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్‌కు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ.. జిల్లాలోని 16 మండలాలకు వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు విశిష్ట రకం వేరుశనగ సరఫరా కాగా 90 శాతం దారిమల్లించి అమ్మేసుకున్నారని వాపోయారు. రైతులకు తీరని అన్యాయం చేసిన వ్యవసాయ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


