మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం | - | Sakshi
Sakshi News home page

మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం

Aug 11 2026 1:48 AM | Updated on Aug 11 2026 1:48 AM

శ్రీశైలంటెంపుల్‌: జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీశైల మల్లికార్జున స్వామివారికి శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. సోమవారం వేకువజామున రుద్రహోమం నిర్వహించారు. చండీపారాయణ, శ్రీచక్రార్చన, నవావరణార్చన విశేష కుంకుమార్చనలు జరిపించారు. ఆరుద్రోత్సవ పూజాదికాల తర్వాత అర్చకులు ఘటాభిషేక సంకల్పాన్ని పఠించారు. అనంతరం మహాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం పాతాళగంగ వద్ద కృష్ణవేణి నదీమాతల్లికి పూజాదికాలు జరిపి కలశాలలో పుణ్య జలాలను అర్చకులు తీసుకువచ్చారు. దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, అర్చకులు కృష్ణవేణినదీజలాలతో పాతాళేశ్వరస్వామివారి ఆలయంలో అభిషేకాది అర్చనలను నిర్వహించారు. అనంతరం జలకలశాలను తలపై ఉంచుకుని వేదమంత్రాల నడుమ భజంత్రీలతో నంది ఆలయం వద్దకు చేరుకున్నారు. నందిగుడిలో నందీశ్వరస్వామివారికి, గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి, క్షేత్రపాలకుడు బయలువీరభద్రస్వామివారికి అభిషేకాది అర్చనలు జరిపించారు. జలకలశాలతో ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయంలో ఉన్న ప్రధాన కలశాలకు, ఇతర కలశాలకు, కృష్ణవేణినదీజల కలశాలకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తర్వాత మల్లికార్జున స్వామివారికి సహస్రఘటాభిషేకం ప్రారంభించారు. ఈ ఘటాభిషేకం పూర్తయ్యేంత వరకు నిరంతరంగా అర్చకులు రుద్రమంత్రాలను పఠించారు. అభిషేక అనంతరం మహానివేదన, నీరాజన, మంత్రపుష్ప కార్యక్రమాలు జరిపించారు. ఘటాభిషేక సందర్భంగా స్వామివారి గర్భాలయానికి అడ్డంగా మూడు డుగుల మేర తాత్కాలికంగా గోడ కట్టారు. దీంతో రోజంతా స్వామివారు ఘటాభిషేకజలంలోనే ఉంటారు. వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 9.15గంటలకు పూర్ణాహుతి, కలశద్వాసన, మహాదాశీర్వచనంతో వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేక విశేష పూజలు ముగుస్తాయి. పూజల్లో దేవదాయశాఖ అదనపు కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర ఆజాద్‌, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement