కోవెలకుంట్ల: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రెండేళ్లు దాటిపోయినా బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాలకు చేరుకుని బిల్లుల జాప్యంపై అధికారులను నిలదీశారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో కాంట్రాక్టర్లు సీసీరోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి పథక పనులను సొంత నిధులు వెచ్చించి పూర్తిచేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా చెల్లించకుండా ఆలస్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బిల్లుల మంజూరులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బిల్లులు మంజూరు చేయవద్దని అడ్డు చెప్పారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల జీవితాలతో చెలగాటమాడుతారా అని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించి బిల్లులు తక్షణమే విడుదల చేయకపోతే కాంట్రాక్టర్లతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్డు ఎద్దుల మార్కెట్ వద్ద సోమ వారం మధ్యాహ్నం కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పేలిపోవటంతో అదుపు తప్పి బోల్తా పడింది. వివరాలు.. చైన్నె నుంచి ఎంహెచ్04ఎన్ బీ3278 అనే నెంబర్ గల లారీ ముంబాయికి కట్టెల లోడ్‌తో వెళ్తుంది. పట్టణంలోని ఎద్దుల మార్కెట్ వద్దకు రాగానే లారీ వెనుక రెండు టైర్లు పేలడంతో లారీ అదుపుతప్పి రోడ్డు డివైండర్ మధ్యలో బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్ సాజిద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ బోల్తా పడినప్పడు ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
చెలరేగిన కర్నూలు బ్యాటర్లు
అనంతపురం: ఏసీఏ సీనియర్ మెన్స్ సౌత్‌జోన్ అంతర్ జిల్లా మల్టీడే క్రికెట్ టోర్నీలో కర్నూలు జట్టు బ్యాటర్లు చెలరేగారు. ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న పోటీల్లో సోమవారం అనంతపురం, కర్నూలు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచి కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 375 పరుగులు సాధించింది. బ్యాటర్ ఎ.సాయి సూర్యతేజారెడ్డి 133 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. తౌఫిక్ హుస్సేన్ 72 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు. అనంత బౌలర్లలో పి.గిరినాథరెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు.


