వక్ఫ్‌బోర్డు ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకు ఇస్తాం | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌బోర్డు ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకు ఇస్తాం

Aug 11 2026 1:48 AM | Updated on Aug 11 2026 1:48 AM

వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌

కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్‌ ఆస్తుల్లో కమర్షియల్‌పరంగా ఉన్న వాటిని ప్రైవేట్‌ వ్యక్తులకు, సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాలు వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతం అయినట్లు చెప్పారు. కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకుండా ఉండడంతో వాటిని కమర్షిల్‌ పరంగా వినియోగించేందుకు సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వక్ఫ్‌ విలువైన ఆస్తులను లీజు ప్రతిపాదికన 30 ఏళ్లకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంబంధిత మసీదులకు, దర్గాలకు మాత్రమే చెందుతుందన్నారు. దానిలో కేవలం 7 శాతం మాత్రమే వక్ఫ్‌ బోర్డుకు వస్తుందన్నారు. విలువైన వక్ఫ్‌ ఆస్తులను గుర్తించి లీజుకు ఇచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో సోమవారం ఆయన పలు వక్ఫ్‌ ఆస్తులను సందర్శించి అందులో షాపింగ్‌ మాల్స్‌, ఫంక్షన్‌ హాళ్లు కట్టేందుకు చర్యలు తీసకుంటున్నట్లు చెప్పారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను ఎవరూ కొనడానికి, అమ్మడానికి వీలు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్‌ చట్ట సవరణ తరువాత రాష్ట్రంలో 61 వేల ఎకరాల నుంచి 82 వేల ఎకరాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడినట్లు చెప్పారు. వక్ఫ్‌ ఆస్తులను డిజిటలైజేషన్‌ చేస్తున్నామని, తద్వారా ఆస్తుల సంరక్షణకు వీలు ఉంటుందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి కర్నూలులో రీజినల్‌ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. 2016 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి సంబంధించిన వక్ఫ్‌ రికార్డులను ఇవ్వలేదని, ఇటీవల 2,800 రికార్డులను అప్పజెప్పిందని, వాటిని డిజిటలైజేషన్‌ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సబీహా పర్వీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement