● విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు
ఇన్‌స్పైర్ మనక్
● నమోదుకు సెప్టెంబర్ 15 వరకు గడువు
● నవీన ఆలోచనలు ఆవిష్కరణకు ప్రోత్సాహం
నంద్యాల(న్యూటౌన్): బాల్యం నుంచే పిల్లల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఇన్‌స్పైర్ మనక్’ను అమలు చేస్తోంది. నవీన ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలతో ప్రతిభ చాటిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అరుదైన అవకాశాలను కల్పిస్తోంది. అవార్డు 2026–27కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇన్‌స్పైర్ మనక్‌లో ప్రతిభ కనబరిచి సమాజాన్ని ప్రభావితం చేసే అత్యుత్తమ ఆవిష్కరణలు రూపొందించే విద్యార్థులకు నేరుగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని స్వయంగా కలిసి తమ ప్రాజెక్టులను ప్రదర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది. అలాగే జాతీయ సాంకేతిక ప్రదర్శనల్లో పాల్గొనే వెసులుబాటు కూడా దక్కుతుంది.
అర్హులు వీరే..
10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు కలిగి ప్రస్తుతం ఆరు నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, ఏపీ మోడల్ స్కూళ్లు, కేజీబీవీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పాఠశాల నుంచి గైడ్ టీచర్‌తో కలిసి విద్యార్థులు పాల్గొనే అవకాశముంటుంది. పాఠశాలల హెచ్‌ఎంలు, గైడ్ టీచర్లు చొరవ తీసుకుని విద్యార్థుల నూతన ఆలోచనలను పోర్టల్‌లో నమోదు చేయించాల్సి ఉంటుంది.
దరఖాస్తులు ఇలా...
ఔత్సాహిక విద్యార్థులు తమ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడి సహాయంతో www.inspireawards.gov.in వైబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబరు 15వ తేదీ వరకు గడువు ఉంది. గతంలో 2022–23 గాను జిల్లా స్థాయిలో 183, రాష్ట్ర స్థాయిలో 17, 2023–24కి సంబంధించి జిల్లా స్థాయిలో 126, రాష్ట్రస్థాయిలో 12, 2024–25కి సంబంధించి జిల్లాస్థాయిలో 153, రాష్ట్రస్థాయిలో 14, 2025–26వ సంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయిలో 143 ప్రాజెక్ట్లు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగం కోసం విద్యార్థి ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికై తే రూ.25 వేలు, జాతీయస్థాయికి రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభావంతులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేస్తారు. నవీన ఆవిష్కరణపై పేటెంట్‌తో పాటు ఐఐటీ, ఎయిమ్స్ వంటి ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించేందుకు ఇన్‌స్పైర్ మనక్ దోహదపడుతుంది. గైడ్ టీచర్లు విద్యార్థులతో మాట్లాడి, సమాజంలో రోజువారీ సమస్యలకు పరిష్కారం చూపే వినూత్న ప్రాజెక్టులను ఎంపిక చేయాలి. నామినేషన్ల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అర్హత ఉన్న ఏ విద్యార్థి కూడా అవకాశాన్ని కోల్పోకూడదు.
– జనార్దన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల


