ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన అహోబిల క్షేత్రం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావణ క్షేత్రం కిటకిటలాడింది. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. దిగువ అహోబిలంలో ఉత్సవ మూర్తు లు శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
సంగమేశ్వరానికి సందర్శకుల తాకిడి
కొత్తపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రమైన సంగమేశ్వరాలయం పూర్తిగా కృష్ణానది జలాలో జలాదీవాసం అయ్యింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా జూరాల నుంచి 2,32,308 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నీటిమట్టం 876.20 అడుగులకు చేరుకుంది. దీంతో మండలంలోని సంగమేశ్వరాలయం ఎగువ పుష్కరఘాట్ వద్ద శ్రీశైలం వెనుక జలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. రెండవ శనివారం సెలవుదినం కావడంతో భక్తులు సందర్శకులు ఎగువ పుష్కరఘాట్ వద్దకు చేరుకుని కృష్ణమ్మ అందాలను ఆస్వాదించారు. భక్తులు పుణ్య స్నానాలు చేసి ఎగువన ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో పూజలు చేసుకున్నారు.
విదేశాలకు పార్సిల్ సౌకర్యం
నంద్యాల(వ్యవసాయం): విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు, వినియోగదారులకు సరుకులు, ఇతర పార్సిళ్లను ప్రజలు తమ సమీపంలోని పోస్టాఫీస్ నుంచే పంపే అవకాశం ఉందని నంద్యాల డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ అప్పలస్వామి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ శాఖ నాలుగు రకాల అంతర్జాతీయ సేవలను అందుబాటులో తీసుకొచ్చిందని తెలిపారు. ఇంటర్నేషనల్ ట్రాక్ట్ ప్యాకెట్ సర్వీస్‌లో తక్కువ బరువు ఉన్న బహుమతులతో సహా రకరకాల వస్తువులను పంపుకోవచ్చు అని తెలిపారు. ఎయిర్ పార్సిల్ సర్వీస్‌లో ఎక్కువ బరువును కలిగిన పార్శిల్‌ను పంపుకునే వెసులుబాటును కల్పించారని వివరించారు. పార్సిల్ బరువు, పంపుతున్న దేశ ఆధారంగా ధర ఉంటుంది అని తెలిపారు.


