నంద్యాల: డీఎస్సీ – 2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారాలను నిరసిస్తూ, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే దీక్షలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. శనివారం మూడవ రోజు పార్టీ శ్రేణులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు దీక్షలకు భారీగా హాజరయ్యారు. జిల్లాలోని నంద్యాల, చాగలమర్రి, పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం, కొత్తపల్లిలో చేపట్టిన రిలే నిరహార దీక్షకు ప్రజలు, యువత నుంచి విశేష స్పందన లభించింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి అర్హులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, హాస్టల్ విద్యార్థులకు వసతి దీవెన పథకాన్ని అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని యువత, నిరుద్యోగులు నినాదాలు చేశారు.


