ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
● టీబీ డ్యామ్‌లో ఆశాజనకంగానే నీటి లభ్యత ● ఎల్లెల్సీ ఆయకట్టుకు నీరిచ్చే విషయంపై తర్జనభర్జన
కర్నూలు (సిటీ): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి కొంత ఆలస్యంగానైనా వరద నీరొచ్చి చేరుతోంది. నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆయకట్టుకు నీరిచ్చే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. టీబీ డ్యాంలోకి నీరొస్తుందనే ఆశతో వేలాది మంది ఆయకట్టు రైతులు పంటలను సాగు చేసి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో అప్పులు చేసి సాగు చేసిన పంటలను చూసి తట్టుకోలేని చాలామంది తొలగించారు. టీబీ డ్యాంలో నీరొస్తే ఆరుతడి పంటలను సాగు చేయొచ్చని ఆశించారు. అయితే జల వనరుల శాఖ ఇంజినీర్లు, టీబీ డ్యాం ఇంజినీర్లు సాగు నీటి విషయంపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.
వర్షాభావ పరిస్థితుల సాకు!
ప్రస్తుతం డ్యాంలో 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది, డ్యాంలోకి 47 వేల క్యుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. బోర్డు నిబంధనల ప్రకారం 40 టీఎంసీలకుపైగా నీరు ఉండి, ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఆవుట్ ఫ్లో కంటే ఎక్కువగా ఉంటే సాగు నీటిని విడుదల చేయాలి. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను సాకు చూపించి కాల్వలకు నీటిని విడుదల చేయకపోవడం బట్టి చూస్తుంటే ఖరీఫ్ పంటలకు సాగు నీటిని అందించే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉందని, ఒకటి, రెండు రోజుల్లో కర్ణాటక సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించి ఖరీఫ్ పంటలకు నీరు ఇవ్వాలా? వద్దా అని నిర్ణయం తీసుకోనున్నారు.
4.46 లక్షల ఎకరాల ఆయకట్టు
తుంగభద్ర రిజర్వాయర్ సామర్థ్యం 105.788 టీఎంసీల కాగా.. జూన్ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాది 62 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఆగస్టు 7వ తేదీ నాటికి 208.90 టీఎంసీల తుంగభద్ర జలాల నీటి లభ్యత వచ్చింది. గత పదేళ్లలో సరాసరిగా 76.49 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు టీబీ డ్యాం అధికార వర్గాలు చెబుతున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 ప్రకారం ఉమ్మడి జిల్లాల్లోని దిగువ కాలువకు 29.5 టీఎంసీలు ఇవ్వాలి. అలాగే కర్నూలు–కడప కాలువకు 39.90 టీఎంసీల(ఇందులో 29.9 టీఎంసీలు తుంగభద్ర నది ప్రవాహం నీటి నుంచి, 10 టీఎంసీలు టీబీ డ్యాంలో నిల్వ నీటి నుంచి) నీరు ఇవ్వాలి. ఆ నీటిపై ఆధారపడి సుమారు 4.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. టీబీ డ్యాం అధికార వర్గాలు చెబుతున్న గణాంకాల ప్రకారం జూలై చివరి నాటికి కనీసం డ్యాంలోకి 80 టీఎంసీలకు పైగా రావాలని ఆ స్థాయిలో ఈ ఏడాది నీటి లభ్యత లేకపోవడంతోనే ఆయకట్టుకు ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది.
కేసీ పక్కనే నీరు...అయినా కన్నీరే!
తుంగభద్రనదిపై ఆధారపడిన కేసీ కాలువ ఆధారిత తాగునీటి పథకాలను నీరు అందడం లేదు. ఆ పథకాలపై ఆధారపడిన గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మల్యాల దగ్గర కేసీకి నీటిని పంపింగ్ చేసేందుకు ఉన్న రెండు మోటర్లను ఆన్‌చేస్తే తాగునీటి ఇబ్బందులు తీరుతాయని ప్రజలు కోరుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కేసీ కెనాల్‌పై నందికొంట్కూరు నగర పంచాయతీకి తాగు నీటిని అందించే వాటర్ స్కీం ఉంది. అలాగే లక్ష్మాపురం తాగు నీటి పథకం, మిడ్తూరు మండలానికి తాగు నీటిని అందించే స్కీంకు నీరు లేదు. ఆ స్కీంలపై ఆధారపడిన ప్రజలు శ్రీశైలం ప్రాజెక్టు పక్కనే ఉన్నా తమ దాహం తీర్చేందుకు అవకాశం లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 70 టీఎంసీల వరకు నీరు ఉంది. తాగునీటి అవసరాలకు కోసమే విడుదల చేస్తున్నాం. ఆయకట్టుకు నీరు ఇవ్వాలనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ ప్రభుత్వం నుంచి సాగుకు ఎలాంటి ఇండెంట్ రాలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంది. ఎగువన వర్షాలు తగ్గుతుండడంతో నీటి చేరికలు హెచ్చు, తగ్గులు ఉన్నాయి.
– నారాయణ నాయక్, టీబీ డ్యాం, ఎస్ఈ


