కర్నూలు(టౌన్): కర్నూలు నగరంలో గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక పాతబస్తీకి చెందిన షేక్ ఇంతియాజ్(32) 2024 కర్నూలు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇతను టీడీపీకి చెందిన మంత్రి టీజీ భరత్ అనుచరుడిగా తెలుస్తోంది. ఇంతియాజ్‌కు ప్రత్యర్థులు మహబూబ్ అలీ, ఇమ్రాన్ అనే వ్యక్తులతో రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. గతంలో మృతుడు ప్రత్యర్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో వారిపై రాజకీయ, మోసం కేసులను నమోదు చేశారు. గతేడాది ఏప్రిల్‌లో ఇంతియాజ్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. గతంలో వీరి మధ్య గొడవలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో రాజకీయంగా కక్ష పెంచుకున్న నిందితులు ఉస్తాద్ మహబూబ్ అలీ, ఇమ్రాన్ వారికి అనుచరులుగా ఉన్న జవాద్, ఇర్ఫాజ్ అర్ధరాత్రి సమయంలో మాసుం బాషా దర్గా సమీప పాన్ షాపు వద్ద ఇంతియాజ్‌తో గొడవ పడ్డారు. నిందితులు బండరాయితో ఇంతియాజ్ తలపై మోదడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన మృతుడి స్నేహితులు సుభాన్, అల్తాఫ్ కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. ఇంతియాజ్‌ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడి తమ్ముడు షేక్ ఇలియాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు.


