బాబూ.. రాయలసీమపై ద్వేషం ఎందుకు? | - | Sakshi
Sakshi News home page

బాబూ.. రాయలసీమపై ద్వేషం ఎందుకు?

Aug 7 2026 6:22 AM | Updated on Aug 7 2026 6:22 AM

● కేసీకి నీరు విడుదల చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తాం ● వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ దారా సుధీర్‌

● కేసీకి నీరు విడుదల చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తాం ● వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ దారా సుధీర్‌

పగిడ్యాల: రాయలసీమ ప్రాంతంపై సీఎం చంద్రబాబుకు ద్వేషం ఎందుకని నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ దారా సుధీర్‌, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరిగిరెడ్డి రామచంద్రారెడ్డి, రైతు విభాగం వర్కింగ్‌ కమిటీ కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. చలో ముచ్చుమర్రి కార్యక్రమంలో భాగంగా వారు రైతులతో కలిసి బుధవారం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ వద్ద కృష్ణా జలాల సందర్శనకు బయలుదేరారు. ముచ్చుమర్రి గ్రామానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను మార్గమధ్యలోనే నెహ్రూనగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద నందికొట్కూరు రూరల్‌ సీఐ సుబ్రమణ్యం, ఎస్‌ఐలు నరేంద్ర, ఓబులేసు, మల్లికార్జున అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఎత్తిపోతల పథకాన్ని సందర్శించరాదని వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిలువరించారు. తీవ్ర వర్షాభావం నెలకొని రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతోందని, రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆశయంతో కృష్ణా జలాల సందర్శనకు వచ్చామని దారా సుధీర్‌ వివరించారు. అయినా ప్రాజెక్ట్‌ సందర్శనకు పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి కేసీ కాలువకు నీటి విడుదల చేయాలని నిరసన తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల కేసీసీ లిఫ్ట్‌ నుంచి కేసీ కాలువకు 5 టీఎంసీ నీటిని వాడుకునేందుకు అనుమతులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 790 అడుగుల లోలెవెల్‌ నీటిని కూడా వాడుకోవడానికి మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముచ్చుమర్రి ఎత్తిపోతలను నిర్మించారని గుర్తు చేశారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్‌ కూడా సీఎం చంద్రబాబు నిర్మించలేదని ధ్వజమెత్తారు. జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్సార్‌ 78 ప్రాజెక్ట్‌లు నిర్మించారన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ ప్రాజెక్ట్‌ను చేపట్టి 85 శాతం పనులు పూర్తి చేయించారన్నారు. కేసీ కాలువకు రెండ్రోజుల్లో కృష్ణా జలాలు విడుదల చేయలాని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. గడప గడపకుకాకుండా పొలం పొలం తిరిగి రైతాంగ సమస్యలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరిష్కరించాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుల్యాల నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోసిక తిరుమలేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్‌ యాదవ్‌, మాజీ సర్పంచ్‌ మద్దిలేటి, నాగశేనారెడ్డి, బోయ మధు, కాటం వెంకటరమణ, శింగారం రంగా, కళ్యాణ్‌, రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

14 మందిపై కేసు నమోదు

ప్రభుత్వ అనుమతి లేకుండా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ సందర్శనకు వచ్చి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ దారా సుధీర్‌, వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, శిరిగిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు పుల్యాల నాగిరెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, తిరుమలేశ్వరరెడ్డితో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేంద్ర బుధవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement