ఎస్పీ సునీల్ షొరాణ్
మహానంది: తప్పిపోయిన వారితో పాటు నేరాల్లో పాల్గొన్నవారి ఫొటోలను అప్‌లోడ్ చేస్తే చాలు గంటల వ్యవధిలోనే ఆర్‌టీజీఎస్ సీసీ 360 ఏఐ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోగా 100కు ఫిర్యాదు వచ్చింది. నాలుగు టీముల ద్వారా సీసీ 360 ఏఐ కెమెరాల ద్వారా గంటలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. మహానంది పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఆర్. సుస్మితతో కలిసి ఎస్పీ వివరాలు వెల్లడించారు. బ్రాహ్మణకొట్కూరు పీఎస్ పరిధిలో ఏడాది క్రితం మిస్సింగ్ అయిన ఒకరిని ఇదే సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. అలాగే రెండు నెలల క్రితం జాతీయ స్థాయి క్రిమినల్ గ్యాంగ్‌ను పట్టుకున్నామన్నారు.
టీచర్ మందలించిందని..
మహానంది మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో అబ్బీపురం గ్రామానికి చెందిన గోగుల జగదీష్ ఏడో తరగతి, పల్లపు సుధీర్ ఆరో తరగతి చదువుతున్నారు. పాఠశాలలో వేరేవారి మొబైల్ చూస్తుండగా టీచర్ మందలించారు. ఇంటికి వచ్చిన వారు ఎవరికీ చెప్పకుండా ఎక్కడైనా హాస్టల్‌లో ఉందామని వెళ్లారు. సాయంత్రం వరకు వారి కోసం వెతికిన తల్లిదండ్రులు కంగారు పడి 100కు కాల్ చేయడంతో స్పందించిన ఎస్పీ సునీల్ షొరాణ్ వెంటనే ఏఎస్పీ ఆర్. సుస్మితకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులురెడ్డితో పాటు మహానంది, బండిఆత్మకూరు, గోస్పాడు ఎస్‌ఐలు రామ్మోహన్‌రెడ్డి, జగన్మోహన్, సుధాకర్‌రెడ్డిలతో నాలుగు టీములను ఏర్పాటు చేసి వెతికించారు. అదే సమయంలో తప్పిపోయిన ఇద్దరు పిల్లల ఫొటోలను సీసీటీవీ 360 యాప్‌లో అప్‌లోడ్ చేశారు. నంద్యాల ఆర్‌టీసీ బస్టాండు వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాలో రాత్రి తప్పిపోయిన ఒకరైన జగదీష్ ముఖం మ్యాచ్ అయింది. వెంటనే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆటోడ్రైవర్లు, స్థానికులకు ఫొటోలు చూపించడం, రాత్రి 11.30 గంటల సమయంలో ఓ ఆటోడ్రైవర్ వారిని ఓ ప్రదేశంలో చూశానని చెప్పగా వెంటనే అక్కడికి వెళ్లి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారని చెప్పారు. దొరికిన ఇద్దరు విద్యార్థులను ఎస్పీ సునీల్ షొరాణ్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారితో మాట్లాడారు. ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయొద్దని, కష్టపడి చదువుకోవాలని సూచించారు. వారికి నోట్‌బుక్స్, విద్యాసామగ్రి అందించి ప్రోత్సహించారు. ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం కృషి చేసిన పోలీసు సిబ్బందిని ప్రత్యేంగా అభినందించారు.


