రెవెన్యూ శాఖలో పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖలో పదోన్నతులు

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

నంద్యాల(అర్బన్‌): జిల్లా రెవెన్యూ శాఖలో వివిధ కేటగిరిల్లో విధులు నిర్వహిస్తున్న 14 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశాల మేరకు పదోన్నతులు పొందిన అధికారులకు గురువారం స్థానాలు కేటాయిస్తూ డీఆర్‌ఓ రామునాయక్‌ జీవో విడుదల చేశారు.

సంగమేశ్వర క్షేత్రానికి మరో బస్సు సర్వీసు

ఆత్మకూరు: సంగమేశ్వర క్షేత్రానికి భక్తుల రద్దీ దృష్ట్యా మరో బస్సు సర్వీసు పెంచుతున్నట్లు ఆత్మకూరు ఆర్టీసీ డీఎం వినయ్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆత్మకూరు నుంచి ప్రతి రోజూ ఉదయం 8.15 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బస్సు సర్వీసులు ఉన్నాయన్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా సంగమేశ్వర క్షేత్రానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. ఈ మేరకు ఈనెల 20వ తేదీ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మరో బస్సు సర్వీసును నడుపుతామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్టీసీ సీఐ బి.కె.నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మహానందీశ్వరుడిసన్నిధిలో హంపి పీఠాధిపతి

మహానంది: హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామిజీ గురువారం మహానంది క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. దర్శనం అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, హనుమంతశర్మ, అర్చకులు రాఘవశర్మలు పీఠాధిపతికి మహానందీశుడి పట్టువస్త్రం, ప్రసాదాలు అందించారు. ఆలయ విశేషాలను పీఠాధిపతికి వివరించారు.

తుది దశకు డిజిటైజేషన్‌

కర్నూలు(సెంట్రల్‌): ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటైజేషన్‌ తుది దశకు చేరుకుంది. జిల్లాలో కేవలం 356 ఫారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాణ్యంలో 189, మంత్రాలయంలో 167 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఈనెల 24వ తేదీలోపు డిజిటైజేషన్‌ చేయడానికి సమయం ఉంది.

వీఆర్‌లోని 14 మంది

ఏఎస్‌ఐలకు పోస్టింగులు

కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో వీఆర్‌లో ఉన్న 14 మంది ఏఎస్‌ఐలకు పోస్టింగులు దక్కాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరిపోవాలని అందులో పేర్కొన్నారు.

పూజ్యాయ..

రాఘవేంద్రాయ!

మంత్రాలయం: పూజ్యాయ.. రాఘవేంద్రాయ శ్లోకంతో గురువారం భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ప్రత్యేకవారం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మకు పూజలు చేశారు. అనంతరం మూల బృందవనంను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీమఠం ప్రాంగణంలో ఊంజల మండపం నుంచి మంగళవాయిద్యాలతో బంగారు పల్లకీలో మూలబృందవనం మూర్తిని ఊరేగించారు. మధ్వకారిడార్‌, కల్పతర క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లలో భక్తుల కోలాహలం నెలకొంది. అధిక సంఖ్యలో భక్తుల రాకతో మూల బృందావన దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement