● రాజకీయ ఒత్తిళ్లతో పోలీసుల అధికార దుర్వినియోగం
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
నంద్యాల(అర్బన్): రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తూ కూటమి ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తోందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా పోలీసు కస్టడీ మరణాలు, వేధింపులతో యువకుల ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయన్నారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2026 మే నెలలో కృష్ణలంక పోలీసులు గాదె సాయికృష్ణ అనే యువకుడిని విచారణ నిమిత్తం తీసుకెళ్లి అనంతరం అతను కనిపించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. అదే ప్రాంతంలో సీఐ నాగరాజు, పోలీసు సిబ్బంది వేధింపులను భరించలేక క్రాంతికుమార్ అనే యువకుడు మే 21న సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మైనార్టీ యువకుడు దరియా హుసేన్ పుట్టిన రోజు నాడే లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవ డం విచారకరమన్నారు. కోర్టుల్లో సివిల్ వివాదం పెండింగ్‌లో ఉన్నప్పటికీ పిడుగురాళ్ల సీఐ వెంకటరావు, పోలీసు సిబ్బంది రాజకీయ ఒత్తిళ్లతో హుసేన్ ను ఇల్లు ఖాళీ చేయాలని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రతిరోజు పోలీసు స్టేషన్‌కు పిలి పించి గంటల తరబడి విచారణ చేపట్టడం వల్ల మానసిక వేదనకు గురయ్యాడన్నారు. ఇల్లు ఖాళీ చేయకపోతే గంజాయి కేసులు నమోదు చేస్తామని పోలీసుల బెదిరించడంతోనే హుసేన్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లోనై అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందోన్నారు. ప్రజల ప్రాణాలు, హక్కులను కాపాడాల్సిన వ్యవస్థే భయాందోళనలకు గురి చేయడం ఆందోళన కరమని విమర్శించారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ఇందు కోసం కృష్ణలంక ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మృతుడు గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారన్నారు.


