డోన్ టౌన్: లోక్ అదాలత్‌లో కేసులు రాజీ అయ్యే విధంగా కక్షిదారుల్లో అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధ్ద్ది అన్నారు. శుక్రవారం ఆయన కోర్టు ఆవరణలో ఫోర్త్ కోర్ట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యతగా నిర్మించాలని కాంట్రాక్టర్లను ఆదేశిస్తూ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జూనియర్ సివిల్ జడ్జి కోర్టును వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక కోర్టు హాల్‌లో న్యాయవాదులు, పోలీసు అధికారులతో శనివారం జరిగే లోక్ అదాలత్‌పై సమీక్ష నిర్వహించారు. కక్షిదారుల లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోనే విధంగా వారిలో అవగాహన కల్పించాలన్నారు. జడ్జి వెంట సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య, ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ జడ్జి వినోద్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జ్యోతి, న్యాయవాదులు ఉన్నారు.
99.97 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ఎస్‌ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియలో భాగంగా 99.97 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని, 74.18 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్‌ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ)పై రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో 1200 ఓటర్లకు మించి ఉండకూడదనే నిబంధనలో భాగంగా కొత్తగా 134 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 1,629 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆళ్లగడ్డలో 14, శ్రీశైలంలో 13, నందికొట్కూరులో 25, నంద్యాలలో 48, బనగానపల్లెలో 29, డోన్‌లో 5 కొత్త పోలింగ్ కేంద్రాలకు (స్థల మార్పిడి, పేరు మార్పిడి) ప్రతిపాదనలు పంపినట్లు రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. అదే విధంగా ఏ ఒక్క పోలింగ్ కేంద్రాలు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రామునాయక్, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు వైఎస్సార్‌సీపీ నాయకుడు సాయిరాంరెడ్డి, బీజేపీ నాయకుడు చంద్రశేఖర్, టీడీపీ నాయకుడు రామ్మోహన్, ఆమ్ ఆద్మీ నాయకుడు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
● బాలికను గర్భిణి చేసిన యువకుడు
కోవెలకుంట్ల: ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు ఆరేళ్లుగా ఓ బాలిక వెంటపడి మాయమాటలతో నమ్మించి గర్భిణిని చేసిన దారుణ ఘటన కోవెలకుంట్లలో చోటు చేసుకుంది. శుక్రవారం బాధితురాలు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు బాలికను ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. శారీరకంగా లోబరుచుకుని మూ డు నెలల గర్భిణిని చేశాడు. ఇటీవల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా బాలిక గర్భం దా ల్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ బాలిక గోవర్ధన్ ఇంటి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి వివాహం చేసుకుందామనడంతో ముఖం చాటేసి తప్పించుక తిరుగుతున్నాడు. తక్కువ కులానికి చెందిన బాలిక వంటూ దూషిస్తూ ప్రెగ్నెన్సీ పోవడానికి మాత్రలు ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. రూ.2 లక్షల డబ్బులు ఇస్తామని రాజీకి రావా లని ఆ యువకుడి బంధువులు బేరసారాలకు దిగినట్లు ఆరోపిస్తోంది. తనను మోసం చేసిన విషయాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా రెండు వారాలు గడువు కావాలని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని గోవర్ధన్‌ను, అతని కుటుంబ సభ్యులను అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను కాకుండా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయం చేసుకున్నాడని వాపోయింది. సంబంధిత అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక మీడియాను ఆశ్రయించింది.


