● సీఎం పర్యటనతో ఒరిగిందేమీ లేదు
● మంత్రి బీసీ అడిగిన రెండు
వినతులపై కూడా స్పందించ లేదు
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఇచ్చిన పాసుపుస్తకాలనే సీఎం చంద్రబాబు మొదటి పేజీ మార్చి పంపిణీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. బనగానపల్లెలో గురువారం నిర్వహించిన ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అసత్యాలు వల్లించి ప్రజలను మభ్యపెట్టారన్నారు. బురదచల్లడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని విమర్శించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేపై అభూత కల్పనతో విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వాటిని పంపిణీ చేస్తుండం విడ్డూరంగా ఉందన్నారు. ఆంగ్లేయుల తరువాత దేశ చరిత్రలో తొలిసారిగా భూముల రీసర్వేను చేపట్టింది వైఎస్ జగన్ పాలనలోనేనని గుర్తు చేశారు. ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వ పని తీరుకు ప్రోత్సాహకంగా కేంద్రం రూ.500 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గుర్తు చేశారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సభలో బీసీ హాస్టల్‌తో పాటు ఎస్సార్‌బీసీ కాల్వ ల అభివృద్ధి గురించి మంత్రి బీసీ చంద్ర బాబుకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. సీఎం పర్యటనతో నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని కాటసాని విమర్శించారు.
అభివృద్ధి నిరోధకుడు మంత్రి బీసీ..
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధికి నిరోధకుడని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. మంత్రి బీసీ పని తీరు సరిగా లేదని బహిరంగ సభలో చంద్రబాబు చెప్పడం చూస్తే బీసీ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు అడ్డుకోవడం, సిమెంట్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణకు ఆటంకాలు సృష్టించడం, కమీషన్ల కోసం కొలిమిగుండ్ల మండలంలోని పవర్‌గ్రిడ్ పనులకు ఇబ్బందులు పెట్టడం వెనుక బీసీ ఉన్నారని విమర్శించారు. మంత్రి స్వగ్రామం యనకండ్లలో 70 ఏళ్ల దళిత మహిళ అత్యాచారానికి గురై అవమానంతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందేన్నారు. రవ్వలకొండ సమీపంలో అక్రమ మైనింగ్‌తో ఏపీ మోడల్ స్కూల్, బాలికల వసతి గృహం, బీసీ బాలుర వసతి గృహాల విద్యార్థులు భయాందోళన చెందుతున్నారన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి చెందిన భూములు కోల్పోయిన బత్తులూరుపాడు రైతులకు పరిహారం ఇచ్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనేననే విషయం రైతులందరికీ తెలిసిందే నన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బీవీ నాగార్జునరెడ్డి, సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి అంబటి రవికుమార్‌రెడ్డి అబ్దుల్‌ఫైజ్, సురేష్, ఖానిక్ పాల్గొన్నారు.


