● వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు కాటసాని
రాంభూపాల్‌రెడ్డి
కర్నూలు (టౌన్): ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు తమ ఓటును కాపాడుకోవాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఓటరుగా గుర్తింపు పొందాలన్నారు. శని, ఆదివారం రెండు రోజులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ శిబిరాల్లో ప్రతి బీఎల్‌ఏ పాల్గొనాలన్నారు. బీఎల్‌ఏలు ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫారాలు పూరించడం వంటి ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహించే ఈ ప్రత్యేక శిబిరాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరాలు పనిచేస్తాయన్నారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు ఉంటారని, ప్రతి పౌరుడు శిబిరాల్లో తమ ఓటును ధ్రువీకరించుకోవాలన్నారు. 2024 ఎన్నికల్లో ఎక్కడ ఓటు వేశారో అక్కడ అధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తీసుకొని బీఎల్‌ఓలను కలవాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీఎల్‌ఏల సహకారం తీసుకొని ప్రతి ఓటును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, ఏ పార్టీకి ఓటు వేయాలన్న ముందుగా ఓటును కలిగి ఉండటం ప్రధానమన్నారు.


