మిగిలింది ఐదు రోజులే! | - | Sakshi
Sakshi News home page

మిగిలింది ఐదు రోజులే!

Jul 10 2026 7:52 AM | Updated on Jul 10 2026 7:52 AM

చివరి తేదీ వరకు వేచి చూడొద్దు సర్‌ గడువును పెంచాలి

నంద్యాల(అర్బన్‌): తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రవేశపెట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను ఆందోళనకు గురి చేస్తోంది. గత నెల 15న ప్రారంభమైన ఎస్‌ఐఆర్‌ క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో కలిసి ఎన్యుమరేషన్‌ ఫామ్స్‌ను ఇంటింటికి తిరిగి అందజేశారు. అందజేసిన ఫామ్స్‌ను కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో నింపి ఓటర్లు బీఎల్‌ఓలకు అందజేశారు. వాటిని బీఎల్‌ఓలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ వస్తున్నారు. అయితే 2002లో వివరాలు యాప్‌ మ్యాపింగ్‌ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 14 వరకు గడువు ఉంది. అయితే నంద్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రత్యేక సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మొత్తం 2,76,813 మంది ఓటర్లు ఉండగా మరో నాలుగు రోజుల్లో డిజిటలైజేషన్‌ గడువు ముగుస్తుండగా. ఇప్పటి వరకు 65.8శాతంతో ఇప్పటి వరకు 1,82,133 మంది డిజిటలైజేషన్‌ పూర్తి చేసుకోగా ఇంకా 94,680 మంది డిజిటలైజేషన్‌ చేసుకోవాల్సి ఉంది. కొన్ని చోట్ల అధికారుల ఒత్తిడి తట్టుకోలేక బీఎల్‌ఓలు ఎన్యుమరేషన్‌ పత్రాలు ఇచ్చినట్లు రికార్డులు చూపుతున్నట్లు సమాచారం. అధికారులు చొరవ తీసుకుని సర్‌ ప్రక్రియ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని, లేకపోతే గడువు పెంచాలని ప్రజా సంఘాలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

శిక్షణ ఇవ్వకుండా ఫీల్డ్‌లోకి..

● బీఎల్‌ఓలకు తూతూ మంత్రంగా శిక్షణ ఇచ్చి నేరుగా ఫీల్డ్‌లోకి పంపడంతో వారి అనుభవ రాహిత్యంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

● చదువుకున్న వారు సైతం ఎన్యుమరేషన్‌ పత్రాలు నింపలేక, నిబంధనలు అర్థంకాక తికమక పడుతున్నారు.

● నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 50 శాతం డిజిటలైజేషన్‌ కూడా పూర్తి చేయలేక బీఎల్‌ఓలు మల్లగుల్లాలు పడుతున్నారు.

● మున్సిపల్‌ శేషన్న ప్రత్యేక ఓటరు సవరణకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ సర్‌ కార్యక్రమం ముందుకు సాగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

● యాప్‌లో సర్వర్‌ లోపం, సాంకేతిక సమస్యలు ఏర్పడి మ్యాపింగ్‌ ప్రక్రియ ముందుకు సాగడంలేదు.

● ఇన్ని సమస్యల మధ్య రోజుకు 30 ఎన్యుమరేషన్‌ ఫారాలు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయలేక సతమతమవుతున్నారు. ఇవేకాకుండా బీఎల్‌ఎలకు సర్‌ డ్యూటీతో పాటు రెవెన్యూకు సంబంధించి పాస్‌ పుస్తకాలు, రీసర్వే పెన్షన్లు తదితర అదనపు పనులతో ఫీల్డ్‌కు వెళ్తున్నామని ఎగనామం పెట్టడం కొసమెరుపు.

ఎన్యుమరేషన్‌ ఫారాలు పూర్తి చేసిన వారు చివరి తేదీ వరకు వేచి చూడకుండా తక్షణమే ఈఎఫ్‌ను బీఎల్‌ఓలకు సమర్పించి ఓటు హక్కును పరిరక్షించుకోవాలి. ఈనెల 14లోపు ఎన్యుమరేషన్‌ ఫారాలను బీఎల్‌ఓలకు అందిస్తేనే ఓటుకు భద్రత ఉంటుంది.

– శివప్రసాదరెడ్డి, ఈఆర్‌ఓ నంద్యాల నియోజకవర్గం

ప్రజాస్వామ్యంలో ఓటు ప్రముఖమైంది. దాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సర్‌ ప్రక్రియ గడువు పెంచాలి. ప్రజలకు ఇన్యుమరేషన్‌ ఫారంలు నింపడంపై అవగాహన లేకపోవడం, బీఎల్‌ఓలకు పని ఒత్తిడి కావడంతో డిజిటలైజేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. – సాయిరాంరెడ్డి,

వైఎస్సార్‌సీపీ నాయకులు, నంద్యాల

డిజిటలైజేషన్‌కు ఐదు రోజులు

మాత్రమే గడువు

నంద్యాల నియోజకవర్గంలో

65.8 శాతం మాత్రమే పూర్తి

బీఎల్‌ఓలకు అవగాహన లేక

సమస్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement