కోవెలకుంట్ల/కొలిమిగుండ్ల: బహిరంగ సభలో చంద్రబాబు సూపర్ సిక్స్‌పై మళ్లీ ప్రజలను మభ్యపెట్టేలా ప్రసంగించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఒక కుటుంబానికి రూ.15వేలు చొప్పున ప్రతి ఏటా జూన్ మొదటి వారంలోనే అందించారు. అదే పథకాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు తల్లికి వందనం పేరుతో అధికారంలోకి వచ్చి మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెండో ఏడాది ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి పలు ఆంక్షలు పేరుతో కోతలు విధించి ఒక్కొక్కరికి రూ.13 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు తల్లికి వందనం జమ కాక పోగా ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ రూ.15 వేలు జమచేస్తామని బహిరంగ సభలో వ్యాఖ్యనించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. అలాగే గతేడాది ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం సీ్త్రశక్తి పథకాన్ని అమలు చేశారు. ఎన్నికలు ముందు మాత్రం అన్ని రకాల బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఊదరగొట్టి తీరా పథకం అమల్లోకి వచ్చాక ఐదు రకాల సర్వీసులకే పరిమితం చేయడంతో మహిళలు అసహనం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సులో దర్జాగా ఇష్టమైన చోటికి తిరిగి రావచ్చని మహిళలు ఇది నిజమే కదా.. మీరు చప్పట్లు కొడితే కదా మాకు హుషారుగా ఉంటుంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నా మహిళల నుంచి స్పందన లభించలేదు.
మాట్లాడుతుండగానే జనం బయటకు..
చంద్రబాబు బహిరంగ సభలోకి వచ్చాక కూడా చాలా మంది ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలతో పాటు యాగంటి రోడ్డులో ఏర్పాటు చేసిన భోజనాల వద్దకు పరుగులు పెట్టారు. చంద్రబాబు ఎప్పటిలాగే ఊకదంపుడు ఉపన్యాసం మొదలు పెట్టడంతో ప్రజలతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు సభ నుంచి బయటకు వెళ్లిపోతూ కనిపించారు. రీసర్వేలో గతంలో తప్పులు జరిగాయి. రెండేళ్లలో ఎంతో ప్రగతి సాధించామని.. అవునా కాదా.. అని చెప్పండని కోరినా సభికుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత ప్రభుత్వలో రాష్ట్రం విధ్వంసమైపోతుందని నేనొచ్చాక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
వరాలు నిల్
నియోజవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో వెనుకబడిన కొలిమిగుండ్ల, సంజామల మండలాల కు వరాలు కురిపిస్తారని ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. చివరకు నియోజకవర్గ అభివృద్ధిపై మాట మాత్రం కూడా చెప్పకపోవడంతో నిరాశకు లోనయ్యారు. సభ ప్రారంభంలోనే 1992లో ఏర్పా టు చేసిన ఎస్సార్బీసీ పంట కాల్వలు సరిగా లేవని మంత్రి బీసీ జనార్దనరెడ్డి ప్రస్తావించారు. అలాగే పట్టణంలో విద్యార్థులు అధికంగా ఉన్నారని బీసీ హాస్టల్ మంజూరు చేయాలని సభలో కోరినా వాటిపై ఎలాంటి హామీ రాలేకపోవడం గమనార్హం.


