నంద్యాల(వ్యవసాయం): వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం పట్టణంలోని స్పెషల్ సబ్ జైలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం జైల్లోని పరిసరాలను పరిశీలించి ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపై అవగాహన కల్పించారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఖైదీలు ఉంటే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. సబ్‌జైలు సూపరింటెండెంట్ గురుప్రసాద్‌రెడ్డి, లోక్‌అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను బుధవారం ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఐఈఓ శంకర్‌నాయక్ తెలిపారు. గురువారం జరిగిన కామర్స్ పేపర్–2, వొకేషనల్–2 పరీక్షలకు 3,330 మందికి గాను 3,190 మంది విద్యార్థులు హాజరు కాగా 145 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్‌లు తనిఖీ చేసినట్లు తెలిపారు.
● సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 5 పరీక్ష కేంద్రాల్లో బుధవారం 305 మంది విద్యార్థులకు గాను 271 మంది హాజరు కాగా 34మంది గైర్హాజరైనట్లు చెప్పారు.
నిలిచిపోయిన విద్యార్థి బస్సు
బనగానపల్లె: బనగానపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ విద్యార్థి బస్సు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో రాళ్లకొత్తూరు వద్ద నిలిచిపోయింది. అవుకు మండలం వేములపాడు నుంచి ఈ బస్సు బనగానపల్లెకు వస్తుండగా సమస్య తలెత్తింది. అందులోని విద్యార్థులు సుమారు ఆరగంట వరకు అక్కడే వేచి ఉండాల్సివచ్చింది. అర్ధగంట తర్వాత తాడిపత్రి నుంచి బనగానపల్లెకు వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో దానిలో విద్యార్థులు బనగానపల్లెకు చేరుకున్నారు. టైర్ పంక్చర్ కావడంతో సమస్య వ చ్చిందని డిపో మేనేజర్ శశిభూషణ్ తెలిపారు.
డోన్ ఎంపీడీఓపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు
డోన్: ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య అధికారికి డీఎల్‌పీవో నరసింహారెడ్డి సిఫార్సు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కొత్తబురుజు గ్రామంలో మధు అనే ఉద్యోగిని వదిలి మరొకరి వాహనంలో వెెళ్లిపోయినందున ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన వివరించారు. విధి నిర్వహణలో వాహనాన్ని వినియోగించకుండా వినియోగించుకుంటున్నట్లు ప్రభుత్వం నుంచి అద్దె రూపంలో లబ్ధి పొందుతున్నట్లు నిర్ధారించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రైవేట్ వాహనాల బిల్లులను చెల్లించకుండా ఆపివేయాలని కోరారు.


