● జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్
నంద్యాల: ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకులు విస్తృతంగా రుణాలు మంజూరు చేస్తూ ఆర్థిక సహకారం అందించాలని జిల్లా రెవె న్యూ అధికారి రాము నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ(డీఎల్‌ఆర్‌సీ) సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ముఖ్యంగా రైతులు, స్వయం ఉపాధి పొందే యువత, మహిళా సంఘాలకు రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన, స్టాండప్ ఇండియా, పీఎంఎఫ్‌బీవై వంటి పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలను సకాలంలో మంజూరు చేయాలన్నారు. అలాగే వ్యవసాయ, పంట రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ప్రాధాన్యత రంగ రుణాల పంపిణీ లక్ష్యాలను బ్యాంకులు తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. నాబార్డ్ డీడీఎం కార్తీక్ మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలకు ఎగుమతి అవకాశాలు ఉన్నప్పటికీ, స్థానిక బ్యాంకుల నుంచి ఎగుమతి క్రెడిట్ పొందడంలో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులు, యువతలో అవగాహన పెంచేందుకు బ్యాంకుల్లో బ్రోచర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పథకంలో ప్రాజెక్టు ఖర్చుపై 40 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ఆర్‌బీఐ ఎల్‌డీఓ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని 43 బ్యాంకుల్లో 15 బ్యాంకుల్లో మాత్రమే కేవైసీ 99.68 శాతం నమోదైందన్నారు. ఈ విషయంలో ఆయా బ్యాంకులు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు ఎల్‌డీఎం రవీంద్ర కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద కేటాయించిన లక్ష్యాల సాధనలో బ్యాంకులు సాధించిన ప్రగతిని కమిటీకి వివరించారు. అనంతరం డిజిటల్ పేమెంట్స్, నాబార్డ్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ నరసింహారావు, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.


