శ్రీశైలంటెంపుల్: అసలే అరకొర జీతం.. ఆపై మూడు నెలలు అవుతున్నా అందని వేతనంతో శ్రీశైల దేవస్థానం పారిశుద్ధ్య, హౌస్‌కీపింగ్ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. దేవస్థానం కార్మికులందరికీ ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదు ఏర్పాటు చేయడంతో కాంట్రాక్టర్ పప్పులు ఉడకడం లేదు. దీంతో ఏజెన్సీ టెండర్ ప్రకారం పూర్తిస్థాయిలో కార్మికులను సరఫరా చేయక పోవడం, కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య, హౌస్‌కీపింగ్ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సంస్థ దక్కించుకుంది. శ్రీశైల దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ఆరు ప్రముఖ దేవాలయాలకు కలిపి సెంట్రలేజేషన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి అత్యంత అప్తుడైన వ్యక్తికి చెందిన సంస్థకు పారిశుద్ధ్య నిర్వహణను కట్టబెట్టారు. గతేడాది అక్టోబరు 1వ తేదీ నుంచి పద్మావతి సంస్థ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతుంది. చంద్రబాబు ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటైన పద్మావతి ఏజెన్సీకి సూపర్‌వైజర్స్–4, శానిటరీ మేసీ్త్ర–52, హౌస్‌కీపింగ్ వర్కర్స్–506, స్కావెంజర్స్–58, మెషిన్ ఆపరేటర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్–4, ఎలక్ట్రిషియన్స్–5, ఏసీ మెకానిక్–3, ప్లంబర్స్–5, కార్పెంటర్స్–4 ఇలా (వీక్లి ఆఫ్ రిలీవర్స్‌తో) మొత్తం కలిపి సుమారు 641 మందికి కేటాయించారు. వీరికి కార్మిక చట్టం ప్రకారం రూ.12,253 నెలకు వేతనంగా చెల్లిస్తామని టెండర్‌లో పొందుపర్చారు. ఇందులో ఈపీఎఫ్, ఈఎస్‌ఐకి పోను బేసిక్ వేతనంగా ఒక్కొక్కరికి నెలకు 10,690 ఇవ్వనున్నారు. అయితే పద్మావతి సంస్థ రెండు నెలలు గడుస్తున్నా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. అయితే పారిశుద్ధ్య, హౌస్‌కీపింగ్ కార్మికులకు జనవరి, ఫిబ్రవరి వేతనాలు ఇప్పటి వరకు చెల్లించలేదు.
ఫేస్ రికగ్నైజేషన్ హాజరుతో
ఏజెన్సీకి తిప్పలు
పద్మావతి ఏజెన్సీ పూర్తిస్థాయిలో కార్మికులను పనుల్లో పెట్టరనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా పద్మావతి ఏజెన్సీ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ద్య, హౌస్‌కీపింగ్ పనులు చేపట్టినప్పటి నుంచి పారిశుద్ద్యంలో భక్తుల సంతృప్తి స్థాయి కిందిస్థాయికి దిగజారిపోయి చివరి స్థానంలో శ్రీశైల దేవస్థానం నిలిచింది. పద్మావతి ఏజెన్సీపై నమ్మకం సన్నగిల్లి కార్మికులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరుతోనే వేతనం నమోదు అయ్యేటట్లు దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పద్మావతి ఏజెన్సీకి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు కంట్లో నలకలా మారింది. ఈ క్రమంలో హౌస్ కీపింగ్ కింద పనిచేస్తున్న కార్మికులను పారిశుద్ధ్య నిర్వహణ పనులకు వినియోగించుకుంటున్నారు. అయినా కానీ ఇంకా సిబ్బంది తక్కువగా ఉన్నారు.
30 మంది కార్మికులను సరఫరా చేయలేం
పద్మావతి ఏజెన్సీకి టెండర్‌లో పారిశుద్ద్య, హౌస్‌కీపింగ్‌కు కలిపి మొత్తం 641 మంది కార్మికులను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ సంస్థపై నమ్మకం లేకపోవడంతో చాలా మంది ఆ సంస్థలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇప్పటికి 30 మంది కార్మికులను తాము సరఫరా చేయలేమని, ఉన్న కార్మికులతో ఓటీ (ఓవర్ టైం) పనిచేయించుకునేందుకు అనుమతించాలని పద్మావతి ఏజెన్సీ దేవస్థానానికి లేఖ రాశారు. ఏజెన్సీ లేఖపై కమిషనర్ అనుమతులకు పంపారు.
ప్రత్యేక కమిటీ రద్దుకు ఏజెన్సీ యత్నం
పద్మావతి ఏజెన్సీ ద్వారా పారిశుద్ద్యం, హౌస్‌కీపింగ్, మెటీరియల్, మిషనరీల నిర్వహణపై దేవస్థానం నుంచి బిల్లు చెల్లింపులకు పూర్తి పారదర్శకత కోసం దేవస్థాన ఈఓ నలుగురు అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించి బిల్లుకు ఆమోదం తెలిపితేనే బిల్లు చెల్లిస్తారు. దేవస్థానం ఏజెన్సీ నిర్వహణపై కమిటీ వేయడం పద్మావతి ఏజెన్సీకి మింగుడు పడ డం లేదు. ఏదో అరకొర మనుషులను, మెటీరియల్‌ను తీసుకువచ్చి మల్లన్న సొమ్మును కాజేద్దామనుకుంటే దేవస్థాన ఈఓ అడ్డుకట్ట వేయడంపై ఆ సంస్థ ఎండీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఏజెన్సీ నిర్వహణపై వేసిన కమిటీని తొలగించేందుకు ప్రభుత్వ పెద్దలతో ఈఓపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది.
శ్రీశైల దేవస్థానంలో
పద్మావతి ఏజెన్సీ ఇష్టారాజ్యం
మూడో నెల గడుస్తున్నా
చెల్లించని జీతాలు
పారిశుద్ధ్య, హౌస్‌కీపింగ్
కార్మికుల అవస్థలు
కార్మికులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరు
నమోదుకు దేవస్థాన నిర్ణయం
కార్మికులను సర్దుబాటు చేయలేని
ఏజెన్సీ


