గత ఫిబ్రవరి 2వ తేదీన వాముకు అత్యధికంగా రూ.30,303 ధర లభించింది. సగటు ధర మాత్రం రూ.16,099 మాత్రమే. ఈ స్థాయిలో ధర లభించినప్పుడు సగటు ధర కూడా రూ.25 వేల వరకు ఉంటే రైతులకు గిట్టుబాటు ధర లభించినట్లవుతుంది. అలాంటిది సగటు ధర అత్యల్పంగా నమోదు కావడం చూస్తే వ్యాపారుల | - | Sakshi
Sakshi News home page

గత ఫిబ్రవరి 2వ తేదీన వాముకు అత్యధికంగా రూ.30,303 ధర లభించింది. సగటు ధర మాత్రం రూ.16,099 మాత్రమే. ఈ స్థాయిలో ధర లభించినప్పుడు సగటు ధర కూడా రూ.25 వేల వరకు ఉంటే రైతులకు గిట్టుబాటు ధర లభించినట్లవుతుంది. అలాంటిది సగటు ధర అత్యల్పంగా నమోదు కావడం చూస్తే వ్యాపారుల

Mar 4 2026 7:22 AM | Updated on Mar 4 2026 7:22 AM

ఏడాది పొడవున జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగు

క్రయ,విక్రయాలకు కర్నూలు మార్కెట్టే దిక్కు

సిండికేట్‌గా మారుతున్న వ్యాపారులు

సీల్‌ బ్రేక్‌ చేసి కాటాల్లో చేతివాటం

కాటా కోసం రైతులకు తప్పని నిరీక్షణ

మార్కెట్‌కు వచ్చిన వాము నిల్వలు

కర్నూలు(అగ్రికల్చర్‌): తక్కువ పెట్టుబడితో ఎక్కువ నికర ఆదాయాన్ని తెచ్చి పెట్టే పంట కావడంతో రైతులు వాము సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో పండించిన వాము దేశంలోని అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఏడాది పొడవున 10 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. రబీ సీజన్‌లోనే 4,873 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో సాగయ్యే ప్రధాన పంటల్లో వాము కూడా ఒకటి. అయితే మార్కెటింగ్‌కు కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డు మాత్రమే ఆధారం. తీరా ఇక్కడ చూస్తే వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దగా చేస్తున్నారు. కొందరు కమీషన్‌ ఏజెంట్లు వాము రైతులను నిలువునా దోచేస్తున్నారు. అండ గా నిలవాల్సిన మార్కెట్‌ కమిటీ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఉత్తుత్తి తనిఖీలు చేపట్టడం మినహా అక్రమాలను అరికట్టే పరిస్థితి కరువైంది.

ఒకటి, రెండు లాట్లకే అధిక ధర

వాము కాసుల పంట పండించేది కావడంతో మార్కెట్‌కు భారీగా తెప్పించుకునేందుకు వ్యాపారులు ఒకటి, రెండు చిన్న లాట్లకు అత్యధిక ధర కోట్‌ చేస్తారు. ఈ ధరను చూసి కర్నూలు మార్కెట్‌లో వాము ధర మెరుగ్గా ఉందని భ్రమపడి సరుకును తెచ్చి కొందరు కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారుల చేతుల్లో రైతులు నిలువునా మోసపోతున్నారు. ప్రతి రోజూ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు వాము కొని లాభాల పంట పండించుకుంటు న్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు వ్యవసా య మార్కెట్‌ యార్డులో వాము వ్యాపారులు దాదాపు 10 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా సిండికేట్‌గా మారుతున్నట్లు తెలుస్తోంది.

పొద్దుపోయే వరకు కాటా సాగదీత

మార్కెట్‌ యార్డులో మధ్యాహ్నం 2 గంటల సమయానికే ధరలు ఖరారవుతాయి. వెంటనే కాటాలు వేయవచ్చు. ధరలు ఖరారైన రెండు, మూడు గంటల్లోనే వేరుశనగ, కందులు, శనగలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కాటాలు వేయడం పూర్తవుతోంది. వాము తూకాల విషయంలో వ్యాపారులు, కొందరు కమీషన్‌ ఏజెంట్లు తీవ్ర జాప్యం చేస్తూ రాత్రి పొద్దు పోయే వరకు సాగదీస్తున్నారు. మార్కెట్‌ కమిటీ అధికారులు, సిబ్బంది ఐదారు గంటల ప్రాంతంలో వెళ్లిపోతారు. ఆ తర్వాత మార్కెట్‌ యార్డులో రైతులను దోపిడీ చేసే కార్యక్రమం మొదలవుతుంది. తూకాలు పూర్తయిన తర్వాత కొంత చిలుకు మిగు లుతుంది. 50 కిలోలు ఉంటే 25 కిలోలే ఉన్నట్లు.. 25 కిలోలు ఉంటే 10 కిలోలే ఉందనడం.. ఇలా సగానికి సగం దగా చేసి కాసుల పంట పండించుకుంటున్నారు. మార్కెట్‌ యార్డులో వాముపై అక్రమ సంపాదన దాదాపు రూ.కోటి వరకు ఉంటుందనే ప్రచారం ఉంది.

సీల్‌ బ్రేక్‌ చేసి..

మార్కెట్‌ యార్డులో ఎలక్ట్రానిక్‌ కాటాలు వినియోగిస్తున్నారు. వీటికి సీల్‌ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో తొలగించరాదు. తొలగించారంటే రైతులను మోసం చేస్తున్నట్లే. ఇటీవల ఓ కమీషన్‌ ఏజెంట్‌ కాటాకు ఉన్న సీల్‌ తొలగించి తూకాల్లో రైతులను భారీ ఎత్తున దగా చేసినట్లు తేలింది. ఈ కమీషన్‌ ఏజెంట్‌కు రూ.70 వేలు జరిమానా కూడా విధించారు. ఇలాంటి కమీషన్‌ ఏజెంట్లు మార్కెట్‌ యార్డులో మరికొందరు ఉన్నారనే చర్చ జరుగుతోంది. ప్రతి రైతు నుంచి 2–3 కిలోల వరకు తరుగు కింద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శాంపుల్స్‌ రూపంలో ప్రతి ఒక్కరూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా ప్రతి రైతు 10 కిలోల వరకు కోల్పోతున్నారు. అంటే దీని విలువ రూ.1000పైనే.

వాము వ్యాపారంలో జీరో దందా

రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా వాము సాగవుతోంది.

వాము మార్కెటింగ్‌కు కర్నూలు వ్యవసా య మార్కెట్‌ యార్డు మాత్రమే ఆధారం.

మార్కెట్‌కు వచ్చిన రైతులు ఏ ఒక్కరూ మంచి ధర లభించిందని సంతోషంగా వెళ్లే పరిస్థితి లేదు.

రైతులను దగా చేస్తూనే జీరోకు పాల్పడుతూ మార్కెట్‌ కమిటీ ఆదాయానికి సైతం గండికొడుతున్నారు.

ఈ–నామ్‌లోనే కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతున్నప్పటికీ 50 శాతం వరకు జీరోపై తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

రైతుల నుంచి వ్యాపారులు వాము కొనుగోలు చేస్తే మార్కెట్‌ కమిటీకి ఒక్కశాతం ఫీజు చెల్లించాల్సి ఉంది.

ఫీజును ఎగ్గొట్టేందుకు వ్యాపారులు జీరోకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

మార్కెట్‌లో ఎక్కడికక్కడ ముడుపులతో జీరోపై బయటికి తరలిస్తుండటం గమనార్హం.

దగా పడుతున్న వాము రైతు

జాతీయ స్థాయిలో వాముకు డిమాండ్‌ ఉన్నా.. జిల్లా రైతులు మాత్రం నష్టాలను మూటగట్టుకుంటున్నారు. మార్కెట్‌కు వాము రావడం మొదలైందంటే మార్కెట్‌లో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, కార్మికులు, మార్కెట్‌ కమిటీ అధికారులు.. ఇలా అందరికీ పండగే. కొందరు కమీషన్‌ ఏజెంట్లు వాము పండించే గ్రామాలకు వెళ్లి రైతులను తియ్యటి మాటలతో మభ్యపెడుతున్నారు. అమ్ముకోవడానికి తమ వద్దకే వచ్చేలా చేసుకొని దోపిడీ సాగిస్తున్నారు. మరికొందరు రైతులకు ముందుగా అప్పులు ఇచ్చి తమ వద్దే అమ్ముకునే పరిస్థితి కల్పిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. మార్కెట్‌ కమిటీ అధికారుల ఉదాసీన వైఖరి రైతులకు శాపంగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement