పనుల మోత.. జీతంలో కోత | - | Sakshi
Sakshi News home page

పనుల మోత.. జీతంలో కోత

Mar 4 2026 7:22 AM | Updated on Mar 4 2026 7:22 AM

జిల్లా సర్వజన ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల శ్రమ దోపిడీ

పారిశుద్ధ్య పనులతో పాటు ఇతర పనుల అప్పగింత

స్కోరింగ్‌ పేరుతో వేధింపులు

రెండు నెలలుగా అందని వేతనాలు

న్యాయం చేయాలంటూ కార్మికుల ఆందోళన

జీవనం సాగేదెలా

రెండు నెలలుగా వేతనాల్లేవు

గోస్పాడు: అసలే అరకొర వేతనాలు.. ఆపై నెలలుగా నిరీక్షించాల్సి రావడంతో జిల్లా సర్వజన ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టారు. వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తుండంతో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. శ్రమకు తగిన గుర్తింపు, భద్రత లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం షిప్టుల వారీగా 94 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో వేతనాలు సక్రమంగా అందక, మరో వైపు వేతనాల్లో కోత పడే పరిస్థితి నెలకొనడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పని భారంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చేయా ల్సిన పనులకు మించి చేయిస్తున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులతో పాటు వార్డుల్లో కుళాయిలు, తలుపులు, ఫ్లోరింగ్‌ మరమ్మతులు సంబంధించిన పనులు చేయిస్తున్నారు. ప్రస్తుతం పారిశుద్ధ్య పనులపై పర్యవేక్షణ పెరిగిందని కార్మికుల పనితీరుకు స్కోరింగ్‌ ఇస్తూ వేతనాలు మంజూరు చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.18,685 వేతనం అందాల్సి ఉండగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఇతర అలవెన్సులు పోగా చేతికి నెలనెలా రూ.14 వేలు అందాల్సి ఉంది. జిల్లా ఆసుపత్రిలో వారికి నెలకు మొత్తంగా రూ.20 లక్షలకుపైగా బిల్లులు రావాల్సి ఉంది. అయితే కార్మికులకు 95 శాతం స్కోర్‌ ఉంటే తప్ప వారికి ఈ వేతనాలు అందే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన అధికారులు సక్రమంగా బిల్లు లు చేయక పోగా కార్మికులు పని చేస్తున్న పనులకు సంబంధించిన స్కోరింగ్‌ను 88 శాతానికి పరిమితం చేస్తుండటంతో వేతనంలో కూడా కోత పడునుంది. దీంతో తమకు రావాల్సిన వేతనంలో నెలకు రూ. 2వేలకు పైగా తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇది కూడా సక్రమంగా రాక పోతే తమ పరిస్థితి ఏంటని వారు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

పారిశుద్ధ్య కార్మికులుగా నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్నాం. ప్రతినెలా వేతనాలు అందటం లేదు. వేతనాల కోసం ప్రతిసారి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పని చేసిన ఫలితం లేదు. ప్రతిరోజు ఆసుపత్రిలో వ్యర్థాలను తొలగిస్తూ శుభ్ర పరుస్తున్నాం. అధికారులు చెప్పిన ప్రతి పని సకాలంలో చేస్తున్నా మాకు నెల వచ్చే సరికి వేతన కష్టాలు తప్పడం లేదు. ప్రతి నెలా సక్రమంగా జీతాలు చెల్లించి న్యాయం చేయాలి. – కిరణ్‌, పారిశుద్ధ్య కార్మికుడు

మాకు రెండు నెలల జీతం రావాలి. చాలీచాలని వేతనాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. వేతనాలు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూడాల్సి వస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో కుటుంబ పోషణ భారంగా మారింది. వేతనం పెరగక పోగా వచ్చే సొమ్ము సకాలంలో చేతికందటం లేదు. – నాగలక్ష్మమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement