అభివృద్ధి శూన్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి శూన్యం

Jan 28 2026 8:26 AM | Updated on Jan 28 2026 8:26 AM

అభివృ

అభివృద్ధి శూన్యం

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన

ఇంకెన్నాళ్లు డైవర్షన్‌ పాలిటిక్స్‌

మామూళ్ల కోసం మహత్తర నీటి పథకాన్ని నిలిపేస్తారా?

భవిష్యత్‌లో టీడీపీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదు

కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

డోన్‌: రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను చేజేతులారా దూరం చేసుకున్నందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం డోన్‌ పట్టణంలోని ఎం కన్వెన్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు కాట సాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన, జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, పార్టీ పరిశీలకులు దేశం సుధాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజే ష్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుగ్గన మాట్లాడుతూ.. చెప్పిందే చేయడం, మాట తప్పకపోవడం లాంటి లక్షణాలతో ప్రజలకు సుభిక్షమైన పాలన అందించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాదని ఆకర్షణీయమైన అబద్ధ్దాలతో వంచించిన చంద్రబాబునాయుడుకు ఓట్లు వేసి గెలిపించడం ద్వారా ఏమి నష్టపోయామన్నది ప్రజలకు అర్థమైపోయిందన్నారు. నియోజకవర్గంలో వైఎస్సా ర్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేసినా, అక్రమ కేసులు బనాయించి వేధించినా, ఆస్తులు ధ్వంసం చేసి నష్టం కలిగించినా భవిష్యత్తులో టీడీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే చాలా సహనంతో వ్యవహరిస్తున్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థులకు విద్య, వైద్యాన్ని దూరం చేయాలనుకోవడం చంద్రబాబు వక్రబుద్ధికి నిదర్శనమన్నారు. ఇలాంటి విధానాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సూపర్‌సిక్స్‌ పథకాల పేరిట పేదప్రజలను మభ్యపెట్టి గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే పేర్లు మార్చి చంద్రబాబునాయుడు అమలుచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తోందన్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా దోమల నివారణ, పంటలపై క్రిమికీటకాల నివారణ అంటూ చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడిపే బదులు రైతన్న భరోసాకు ఆర్థికసహాయం, పండించిన పంటకు గిట్టుబాటు ధర, సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం ఎక్కడ

దేశంలో ఐదవ అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ప్యాపిలి మండల కేంద్రం వద్ద నిర్మించేందుకు అనుమతులు తీసుకొస్తే ఆ పథకాన్ని టీడీపీ నాయకులు రద్దుచేయించారని మాజీ మంత్రి బుగ్గన ఆరోపించా రు. డోన్‌ రైల్వే గేట్ల కింద అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖను ఒప్పించి రూ.8కోట్లు మంజూరు చేయిస్తే నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధిని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా నిధులు మంజూరు చేయించకుండా కేవలం 15వ ఆర్థిక సంఘం నిధులతో లక్ష విలువ చేసే పనులకు కూడా ప్రజాప్రతినిధులే భూమిపూజ చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.

గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డోన్‌ను మోడల్‌ నియోజకవర్గంగా మార్చేందుకు రూ.3,500 కోట్లను మంజూరు చేశారని బుగ్గన గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు నిర్మిస్తున్న ఐటీడీఆర్‌ భవన నిర్మాణంతో పాటు ఎస్సీ బాలికల కోసం కొత్తపల్లె వద్ద వసతిగృహం, బేతంచెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ఐటిఐ నిర్వహణకు సొంత శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకేసారి నియోజకవర్గంలో 33 చెరువులను హంద్రీనీవా నీటితో నింపి నియోజకవర్గంలో 10వేల ఎకరాల భూమిని సాగులోకి తేవాలని ప్రయత్నిస్తే దానిని టీడీపీ నాయకులు సక్రమంగా పర్యవేక్షించలేకపోతున్నారన్నారు. రూ.320 కోట్లతో గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి శుద్ధ జలాన్ని పంపిణీ చేయాలనే మహత్తర కార్యక్రమాన్ని మామూళ్ల కోసం మధ్యలో ఆపివేసి ప్రజలకు సకాలంలో తాగునీరు అందకుండా చేసింది ఎవరని నిలదీశారు.

అభివృద్ధి శూన్యం 1
1/1

అభివృద్ధి శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement