ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం ముట్టడి
● పోలీసులతో బాధితుల వాగ్వాదం
ఆళ్లగడ్డ: వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్సియల్ సొల్యూషన్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆధ్వర్యంలో వర్క్‌ఫ్రం హోం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడంతో రూ. లక్షలు చెల్లించి ఉద్యోగాల్లో చేరి అనంతరం మోసపోయిన బాధితులు శనివారం ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం దిగ్బంధం చేసి నిరసన వ్యక్తం చేశారు. దొర్నిపాడు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన బాధితులు 200 మంది ట్రాక్టర్లు, ఆటోలు, మోటార్‌బైక్‌లపై తరలి వచ్చారు. డీఎస్పీ కార్యాలయం ఎదురుగా కోవెలకుంట్ల – ఆళ్లగడ్డ ప్రధాన రహదారిపై బైఠాయించి వాహన రాకపోకలకు అంతరాయం కల్పించారు. దీంతో పోలీసులు వాహనాలను జాతీయరహదారిపై మళ్లించారు. ఆందోళన చేస్తున్న వారితో డీఎస్పీ ప్రమోద్ మాట్లాడేందుకు ప్రయత్నించగా వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ, పోలీసు అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో డీఎస్పీ స్పందిస్తూ.. ఒక్కొరొక్కరు అడగండి అన్నింటికీ నేను సమాధానం చెబుతానన్నారు. అయినా వినక పోవడంతో ఆయన అసహనంతో తన కార్యాలయంలోకి వెళ్లిపోయారు. బాధితులు డీఎస్పీ కార్యాలయ ఆవరణలోకి వెళ్లి ‘మూడు నెలల్లో మా డబ్బులు ఇప్పిస్తామని చెప్పిన అధికారులు ఎవరూ ఇప్పుడు పట్టించుకోవడంలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డబ్బులు తిరిగి వస్తాయా రావా.. వడ్డీలు కట్టలేక పోతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. నిందితులను రిమాండ్‌కు తరలించామని, వారి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశామని, బాధితులందరికీ చట్టప్రకారం న్యాయం చేసేందుకు చేస్తున్నామన్నారు. దీంతో బాధితులు ఆందోళన విరమించుకున్నారు.
ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం ముట్టడి


