‘పల్లె’విస్తున్న గోవింద నామస్మరణ
రుద్రవరం: పార్వేట ఉత్సవాల్లో భాగంగా అహోబిలేశుడి ఉత్సవమూర్తుల పల్లకీ గ్రామాల్లో పర్యటిస్టుండటంతో గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. ఉత్సవమూర్తులైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరద స్వామి వారు పల్లకీలో కొలువై గ్రామ గ్రామానికి వెళ్లి తెలుపుల మీద కొలువుదీరగా ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. స్వామి పల్లకీ శనివారం మండలంలోని నర్సాపురం చేరుకోగా గ్రామ పెద్దలు మేళతాళాలతో ఎదురెళ్లి పూజలు చేసి గ్రామంలోకి స్వాగతించారు. స్వామివారి పల్లకీ గ్రామంలోని పలు కాలనీల్లోకి వెళ్లి అక్కడి తెలుపుల మీద కొలువు దీరగా ప్రజలు పూజలు చేశారు. స్వామి వారి పల్లకి మండలంలోని ముత్తలూరుకు చేరుకుంది.
మహానందీశ్వరుడి సన్నిధిలో జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి
మహానంది: మహానందీశ్వరుడి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి పూజలు నిర్వహించారు. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి, కుటుంబ సభ్యులు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. దర్శనం అనంతరం వారికి శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి మెమొంటో, తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
8,100 క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 8,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 0.691 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 1,357 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 2,343, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీతో 2,000, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం దిగువ భాగంలో ఉన్న 3,722 క్యూసెక్కుల నీటిని పంప్‌మోడ్ ఆపరేషన్‌తో జలాశయంలోకి మళ్లించారు.
ఇద్దరు హెచ్‌ఎంల సస్పెన్షన్
బనగానపల్లె: మధ్యాహ్నభోజన పథకంలోని 42 వేల కోడిగుడ్ల దుర్వినియోగం చేసినట్లు తేలడంతో ఇక్కడ పని చేసిన హెచ్‌ఎంలు బీ రామకృష్ణ, ఎస్ శ్రీనివాసులును ఎడ్యుకేషనల్ రిజనల్ జాయింట్ డైరెక్టర్ కె సముయోలు సస్పెన్షన్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులను శనివారం ఎంఈఓ స్వరూప హెచ్‌ఎంలకు అందజేశారు. పాఠశాలలో కోడిగుడ్ల దుర్వినియోగ విషమయంపై ఈ నెల 21న సాక్షి దినపత్రికలో ‘గుడ్డు గుటకాయ స్వాహా’ అనే వార్త ప్రచురితం అయ్యింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి దర్యాప్తు చేసి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
రేపటి పీజీఆర్‌ఎస్ రద్దు
నంద్యాల: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.
ఆన్‌లైన్ కోచింగ్
కర్నూలు(అర్బన్): రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, ఐటీ/ఐటీఈస్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలకు టాన్స్‌జెండర్లు, విభిన్న ప్రతిభావంతులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖసహాయ సంచాలకులు ఫాతిమా తెలిపారు. https://apdascac.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
‘పల్లె’విస్తున్న గోవింద నామస్మరణ


