వక్ఫ్ ఆస్తులకు బదులు హెరిటేజ్ భూములివ్వండి
● జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్
బొమ్మలసత్రం: ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చిన్నకాకాని వద్ద ఉన్న 72 ఎకరాల వక్ఫ్ ఆస్తులకు బదులుగా హెరిటేజ్ భూములను ఇవ్వాలని జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ అన్నారు. మాజీ ఎమ్యేల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి నివాసంలో మైనారిటీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రసూల్ ఆజాద్ మాట్లాడుతూ.. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలో అంజుమన్ ఇస్లామియా సంస్థకు చెందిన 72 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. వక్ఫ్ బోర్డు చట్టాలను తుంగలోకి తొక్కి టీడీపీ రూ. 500 కోట్లకు పైగా పలికే భూములను లాక్కునే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వంలో మైనారిటీల ఆస్తులకు భద్రత లేదని విమర్శించారు. మైనారిటీల ఆస్తులు లాక్కుంటున్నా పదవులు పొందిన కొందరు మైనారిటీలు నోరుమెదపటంలేదన్నారు. వక్ఫ్ భూములు మైనారిటీలకు తప్ప దేనికీ వినియోగించరాదన్నారు. 1915లో అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ అబిముల్లాఖాన్ పేద మైనారిటీల కోసం 80 ఎకరాల భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందులో హజ్‌హౌస్ ఏర్పాటు చేయాలని కృషి చేసిందన్నారు. ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి నిరసనగా ఈనెల 30న గుంటూరులోని రమేష్ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు మైనారిటీలు తలపెట్టిన ర్యాలీకి ముస్లింలు భారీ ఎత్తులో హాజరుకావాలని కోరారు. అనంతరం ర్యాలీకి సంబంధించిన పోస్టర్లనుఆవిష్కరించారు. పార్టీ జిల్లా సెక్రటరీ దేవనగర్ బాషా, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, నాయకులు గన్నీ కరీమ్, సోహెల్‌రాణా, మహబూబ్‌బాషా, జుబేర్, గులాబ్ మహమ్మద్, దాదా, షాఫి మౌలానా, మాజీ కౌన్సిలర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.


