కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తాం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: కేసీ కెనాల్ పరిధిలో రబీ పంటలు వేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 20 రోజులపాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో అక్కడ ఉన్న 33 గేట్లకు మరమ్మతులు చేస్తున్నారన్నారు. కేసీ కెనాల్ పరిధిలో 0 నుంచి 150 కిలోమీటర్ల వరకు నీటి ప్రవాహం తగ్గి నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాల్లో పంటలకు ఇబ్బంది వచ్చిందన్నారు. ఈ ప్రాంతాల్లో జొన్న, మొక్కజొన్న, కంది, మినుము వంటి ఆరుతడి పంటలు, కొంత మేర వరి పంట సాగు చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కేసీ కెనాల్‌కు అవసరమైన మేరకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్పీ సునీల్ షెరాన్, నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, జయసూర్య పాల్గొన్నారు.


