కష్టాలు పగబట్టి.. నష్టాలు మూటగట్టి!
శనగ రైతు కుదేలు
వెంటాడిన ప్రకృతి విపత్తులు, చీడపీడలు
తగ్గిన దిగుబడి, వేధిస్తున్న గిట్టుబాటు ధర
ప్రారంభమైన శనగ కోత, నూర్పిడి పనులు
ధర నేల చూపు..
కోవెలకుంట్ల: రెండేళ్ల నుంచి పప్పుశనగ సాగు రైతుల పాలిట ‘శని’గా మారింది. గతేడాది తీవ్ర నష్టాలు చవి చూసిన రైతులు ఈ ఏడాది కోటి ఆశలతో రబీ సీజన్‌లో మొదటి పంటగా పప్పుశనగ పంట సాగు చేశారు. సాగు ఆరంభం నుంచి రైతులను వరుస కష్టాలు వెంటాడాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది 59,881 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల్లో 53,801 హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ పంట సాగు చేశారు. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లోని సంజామల మండలంలో 9,435 హెక్టార్లు, కోవెలకుంట్ల మండలంలో 8,124, ఉయ్యాలవాడ మండలంలో 11,268, కొలిమిగుండ్ల మండలంలో4,059, దొర్నిపాడు మండలంలో 3,298, అవుకు మండలంలో 1,772 హెక్టార్లలో సాగైంది. ప్రస్తుతం పైరు చేతికందటంతో ఆయా మండలాల పరిధిలో కోత, నూర్పి డి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఓ వైపు దిగుబడి పోవడం, మరో వైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కష్టాలు అన్నీఇన్నీ కావు. గత ఏడాది అక్టోబర్ రెండవ వారం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శనగ సాగుకు అదును కాగా విత్తన సమయంలో వారం, పది రోజులపాటు ఏకధాటిగా వర్షాలు కురిశాయి. ముందస్తుగా సాగు చేసిన పైరు అధిక వర్షాలతో దెబ్బతిని వివిధ ప్రాంతాల్లో రెండవ సారి విత్తనం వేయాల్సి వచ్చింది. భారీ వర్షాలతో పొలాల్లో తడి ఆరకపోవడంతో పొలాల్లో కలుపుమొక్కలు విపరీతంగా పెరిగాయి. వాటిని తొలగించేందుకు రైతు లు అష్టకష్టాలు పడ్డారు. నవంబర్ రెండవ వారం వరకు విత్తన పనులు కొనసాగాయి. సాగుకు అదును దాటి పోవడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో శనగసాగు తగ్గిపోవడంతో సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గతే డాది 68వేల హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీ ర్ణం కాగా 79 వేల హెక్టార్లలో అత్యధికంగా సాగైంది. ఈ ఏడాది 53,801 హెక్టార్లకే పరిమితమైంది.
ఎండు తెగులతో ఆశలు ఆవిరి
వాతావరణం అనుకూలించకపోవడం,తదితర కారణాలతో శనగ పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించిన పైరులో మొక్కలు ఎండిపోయి చనిపో యాయి. బైళ్లు, బైళ్లుగా మొక్కలు ఎండిపోవడంతో కొన్ని చోట్ల ఖాళీ పొలం ఏర్పడింది. జిల్లాలో ఫూలేజి(తెల్లశనగ) రకానికి చెందిన పైరుకు ఎక్కువశాతం ఎండు తెగులు ఆశించింది. దీనికి తోడు గత నెలలో పైరు పూత, పిందె దశలో నాలుగైదు పర్యాయాలు పొగమంచు కురియడంతో పూత, పింది రాలిపోయి నష్టం సంభవించింది. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడులు వస్తానుకుంటే ఎండు తెగులు ఆశించిన పైరులో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడులు, తెగులు ఆశించని పైరులో ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
గతేడాది ప్రభుత్వం క్వింటా రూ. 8,750 మద్దతు ధర ప్రకటించగా మార్కెట్‌లో క్వింటా రూ. 5 వేలు పలకపోవడంతో దిగుబడులు ఇప్పటికీ గోదాములు దాటలేదు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో సాగు చేసిన పప్పుశనగ పైరు కోతకు రావడంతో కోత, నూర్పిడి పనుల్లో నిమగ్నమయ్యారు. నవంబర్ రెండవవారం నుంచి సాగు చేసిన పైరు మరో పది, పదిహేను రోజుల్లో చేతికందనుంది. గోదాముల్లో ఉన్న పాత దిగబడులు క్వింటా రూ. 5 వేలు ధర పలుకుతుండగా కొత్త దిగుబడుల్లో జేజే–11రకం క్వింటా రూ. 5,300, పూలేజి రకం రూ. 5,500 ధర పలుకు తోంది. పెరిగిన పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని ఎర్ర శనగలు రూ. 8 వేలు, తెల్ల శనగలకు రూ. 10 వేలు ధర కల్పిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. రెండేళ్లుగా శనగ పంట కలిసి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కష్టాలు పగబట్టి.. నష్టాలు మూటగట్టి!


