మహిళలపై అఘాయిత్యాలు అరికట్టడంలో ప్రభుత్వ విఫలం
బొమ్మలసత్రం: రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువవయ్యాయని, వాటిని అరికట్టడంలో చంద్రబాబు ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి విమర్శించారు. మహిళలను కాపాడటంలో పోలీసులు సైతం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. తమపై జరుగుతున్న దాడుల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక మహిళలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ ఏడాదిన్నర కాలంగా ఓ మహిళా ఉద్యోగినిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమన్నారు. భర్తకు విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి తేవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అరాచకంపై పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం విచారకరమన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఉన్న ఆసక్తి మహిళలను రక్షించడంలో లేదని చెప్పారు. అసెంబ్లీలో ఇలాంటి వ్యక్తులు ఉండటం ఎంత వరకు సబబో అధికార పార్టీ నాయకులే సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఏం చేస్తుందో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.


