సాంకేతిక పరిజ్ఞానంతో నేర నియంత్రణ
● ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేర నియంత్రణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నేర నియంత్రణపై ఆయన సమీక్షా నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ క్రైం, శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఎస్పీ ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ల వారీ గా కేసులు తగ్గించుకోవాలని, నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కారించాలన్నారు. తరచూ నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ ఉపయోగించి జిల్లా బహిష్కరణ చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా విధులు నిర్వహించాలన్నారు. మహిళలు భద్రత కోసం వారు ఎక్కువగా సంచరించే ప్రదేశాలలో ప్రత్యేక దృష్టి ఉంచి పెట్రోలింగ్ పెంచడంతో పాటు నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కాలేజీలు, వసతి గృహాలు, ప్రార్థన ఆలయాలు చర్చి, మసీదు, దేవాలయ పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసు కోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీలు యుగంధర్ బాబు, జావళి ఆల్ఫోన్స్, డీఎస్పీలు ప్రమోద్, రామాంజి నాయక్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


