ఉత్తమ సేవలకుఘన సత్కారం
గడివేముల: గ్రామ పాలనలో మెరుగైన సేవలు అందించిన కొరటమద్ది సర్పంచ్‌కు ఉత్తమ అవార్డు దక్కింది. దేశ వ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 9 ఎంపిక కాగా.. నంద్యాల జిల్లా గడివేముల మండలం కొరటమద్ది ఒకటి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పారిశుద్ధ్యం, ఇంటి, నీటి పన్నుల వసూళ్లు, వర్మి కంపోస్టు తయారీ, విక్రయాలు, గ్రామ పంచాయతీకి ఆదాయం చేకూర్చే వనరుల నిర్వహణ, తదితర అన్ని రకాల అభివృద్ధి పనులను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రి చేతుల మీదుగా సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎడమకంటి నాగేశ్వరరెడ్డి, దంపతులు అవార్డు అందుకున్నారు.
వంద రోజుల ప్రణాళిక అమలుతో ఉత్తమ ఫలితాలు
సంజామల: పదవ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా వందరోజుల ప్రణాళిక అమలు చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రం సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కానాల, గిద్దలూరు, పేరుసోముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో ఉన్న సైన్స్ ల్యాబ్‌లను, విద్యార్థుల అసెస్‌మొంట్, మధ్యాహ్న భోజనం నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ జనార్దన్ రెడ్డి మాట్లడుతూ.. వెనుకబడిన పదో తరగతి విద్యార్థులపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఆయన వెంట ఎంఈఓలు రమణారెడ్డి, ఈశ్వరయ్య, రాజయ్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
ఎస్సార్‌బీసీలో నిలిచిననీటి ప్రవాహం
బనగానపల్లె: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు నీటి విడుదల నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎస్సార్బీసీ పరిధిలోని పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, సంజామల మండలాల పరిధిలోని 13 బ్లాక్‌ల ద్వారా 1.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, నువ్వులు, మినుము మరి న్ని వాణి జ్యపంటలను కూడా సాగు చేశారు. అయితే అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా నీటిని నిలిపివేయడంతో పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారు. సాగునీటి నిలుపుదల చేస్తే తమ పరిస్థితి ఏమటని ప్రశ్నిస్తున్నారు.
ఉత్తమ సేవలకుఘన సత్కారం


