రౌడీషీటర్ తులసికుమార్ జిల్లా బహిష్కరణ
కర్నూలు: కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శరీన్ నగర్‌లో నివాసముంటున్న కిరాయి హంతకుడు వడ్డె రామాంజినేయులు పెద్ద కుమారుడైన రౌడీషీటర్ వడ్డె తులసి కుమార్ (షీట్ నెం.389)పై జిల్లా కలెక్టర్ ఎ.సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితుడు. పలుమార్లు జైలుకు వెళ్లినప్పటికీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా రకరకాల కేసుల్లో పాల్గొంటున్నాడు. ఈ మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనలతో క్రిమినల్ రికార్డులు పరిశీలించి కలెక్టర్ శనివారం ఇతనిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వు లు జారీ చేశారు. ఈయన తండ్రి వడ్డె రామాంజినేయులు అలియాస్ వడ్డె అంజి, అదే కాలనీలో నివాసముంటున్న పఠాన్ ఇమ్రాన్ ఖాన్‌పై కూడా ఈనెల 11న జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ కావడంతో జైలు జీవితం గడుపుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడిన మరో 15 మంది పేర్లు కూడా జిల్లా బహిష్కరణ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.


