తిరుగు ప్రయాణం.. విషాదం
● ఆటోను ఢీకొన్న కారు
● ఇద్దరు మృతి
● మృతులు అనంతపురం జిల్లా వాసులు
ప్యాపిలి: బంధువుల ఇంట్లో క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకుని స్వగ్రామానికి బయలుదేరిన వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామానికి చెందిన రాజేశ్ (32), నవీన్ (28) తమ కుటుంబాలతో కలసి క్రిస్మస్ వేడుకలకు ప్యాపిలిలో బంధువుల ఇంటికి వచ్చారు. క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకున్న అనంతరం శనివారం వారి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరారు. పోతుదొడ్డి వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. ఆటో పల్టీలు కొట్టడంతో అందులో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్రంగా గాయపడిన రాజేశ్, నవీన్‌ను చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ప్రమాదంలో రాజేశ్ భార్య కళావతి, కుమార్తె వర్షిణి, నవీన్ భార్య స్వీటికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంటి పెద్దలను కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన భర్తల మరణాన్ని భార్యలు కళావతి, స్వీటి జీర్ణించుకోలేక పోతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన నవీన్, రాజేశ్
తిరుగు ప్రయాణం.. విషాదం
తిరుగు ప్రయాణం.. విషాదం


