స్థలం కబ్జా చేసిన మంత్రి కుటుంబ సభ్యులు
● బాధితుల ఆవేదన
బొమ్మలసత్రం: మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూక్ కుటుంబ సభ్యులు తమ స్థలాన్ని కబ్జాచేసి అక్రమంగా షెడ్లు నిర్మించారని, అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు భవనాశి వాసు, నూర్‌బాషా , వెంకటన్న, బాబులాల్ వేడుకున్నారు. మంత్రి కుటుంబ సభ్యుల స్థలం 700 సర్వే నంబర్‌లో ఉండగా తప్పుడు దిశల ఆధారంగా పద్మావతినగర్‌లోని 706ఏ/9 సర్వే నంబర్‌ను చూపుతూ ఇదే తమ స్థలం అని చెప్పడం భావ్యం కాదన్నారు. సుప్రీంకోర్టు ఉత్త్తర్వుల మేరకు పద్మావతినగర్‌లోని ఈ స్థలానికి ఫరూక్ కుటుంబ సభ్యులు, భాధితులను సమక్షంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు శనివారం కొలతలు వేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఈ సర్వే నంబర్‌లో 1.16 ఎకరాలు ఉండగా అందులో 58 సెంట్లు కరీమ్‌బీ, 58 సెంట్లు అశాబీకి 1968లో తల్లి సారంబీ ద్వారా సంక్రమించిందన్నారు. వారి నుంచి తాము కొనుగోలు చేశామన్నారు. అయితే ఈ స్థలం తమదేనని మంత్రి కుటుంబ సభ్యులు అడ్డుపడుతుండటంతో సుప్రీం కోర్టుకు వెళ్లగా స్థలాన్ని తేల్చాలాని సర్వేయర్‌లకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. స్థల వివాదం కోర్టులో ఉండగా మంత్రి కుటుంబ సభ్యులు నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇవ్వడం సరైందికాదన్నారు. న్యాయశాఖ మంత్రి కుటుంబ సభ్యులే అన్యాయానికి పాల్పడితే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.


