మద్దిలేటి క్షేత్రంలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పుష్య మాసంను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భారీగా భక్తులు వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేశారు.
శ్రీశైలం పాదయాత్ర మార్గం పరిశీలన
ఆత్మకూరురూరల్: రానున్న మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల సందర్భంగా నల్లమల గుండా శ్రీశైలానికి పాదయాత్ర ద్వారా వెళ్లే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఆత్మకూరు డీడీ విగ్నేష్ అపావ్ శనివారం మార్గ పరిశీలన చేశారు. వెంకటాపురం నుంచి ఆయన తన సిబ్బందితో కలసి పాదయాత్ర మార్గం వెంట పెచ్చెర్వు వరకు నడిచి వెళ్లారు. దారి వెంట పలు గూడేల్లో చెంచులతో మాట్లాడారు. వారికి అవసరమైన సదుపాయాలపై అవగాహన కల్పించారు. పెచ్చెర్వు చెంచు గూడెంలో అక్కడి యువకులతో కలసి తన సిబ్బందితో వాలీబాల్ ఆడారు. అనంతరం అక్కడి చెంచులతో ప్రత్యేకంగా సమావేశమై సూచనలు ఇచ్చి సలహాలు స్వీకరించారు. డీడీ వెంట ఎఫ్‌ఆర్‌వోలు ప్రణీత, కృష్ణప్రసాద్, అటవీ సిబ్బంది ఉన్నారు.
గ్రామాల్లో ‘మొబైల్’ వైద్య పరీక్షలు
గోస్పాడు: మొబైల్ ఐసీటీసీ వాహనంతో గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. నంద్యాల డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఆవరణలో శనివారం మొబైల్ ఐసీటీసీ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 104 వాహనంతో అనుసంధానం చేస్తూ గ్రామాల్లో హెచ్‌ఐవీ, సిఫిలిస్, టీబీ పరీక్షలు చేసేలా మొబైల్ వాహనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగు నెలల కాలంలో ఈ సేవలు అందించనున్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా సిబ్బంది ప్రణాళికలు తయారు చేయాలని, ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీవీ అధికారి డాక్టర్ శారదాబాయి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లలిత, అధికారులు అలీ హైదర్, సిబ్బంది పాల్గొన్నారు.
పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
గడివేముల: పదో తరగతి విద్యార్థులకు వందరోజుల ప్రణాళికను కచ్చితంగా అమలు చేసి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆదేశించారు. గడివేముల మండలం గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఉన్నత పాఠశాల హెచ్‌ఎం చంద్రావతి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్దిలేటి క్షేత్రంలో భక్తుల రద్దీ
మద్దిలేటి క్షేత్రంలో భక్తుల రద్దీ
మద్దిలేటి క్షేత్రంలో భక్తుల రద్దీ


