శ్రీశైలంలో టెండ‘రింగ్’
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో కొందరు ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో కుమ్మకై మల్లన్న ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శలు వచ్చాయి. తమకు నచ్చిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు తయారు చేశారనే ఆరోపణలు వినిపించాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పనుల టెండర్లలో వివరాలు గందరగోళంగా ఉండటం విమర్శలకు, ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
నిబంధనల్లో మార్పులు ఇలా..
శ్రీశైలంలో ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను 11రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు చలువ పందిళ్లు, అదనపు క్యూలైన్లు, తాత్కాలిక విద్యుద్దీకరణ తదితర 84 పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.13కోట్లతో టెండర్లు పిలిచారు. అయితే వాటిలో వివరాలు, నిబంధనలు సక్రమంగా లేవని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఫర్మ్ రిజిస్ట్రేషన్‌తో చేసే పనులకు సివిల్ క్లాస్ టెండర్ల నిబంధన, క్లాస్–5, క్లాస్–4, క్లాస్–3 ఉండాల్సిన పనులకు ఫర్మ్ రిజిస్ట్రేషన్లు.. ఇలా పలు పనుల్లో నిబంధనలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అలాగే హర్డ్‌వేర్ మెటీరియల్, శానిటరీ మెటీరియల్ తదితర పనులకు సంబంధించిన టెండర్‌లలో సరైన వివరాలు కూడా పొందుపర్చలేదు. దీంతో కాంట్రాక్టర్లు అయోమయానికి గురై టెండర్లు కూడా వేయలేదని తెలుస్తోంది.
నయా ట్రెండ్‌కు శ్రీకారం
శ్రీశైల దేవస్థానంలో కొందరు ఇంజినీర్లు నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. గతంలో ఏదేని పని పూర్తి చేసిన తరువాత బిల్లు చెల్లించేటప్పుడు పర్సెంటేజీ ప్రకారం కాంట్రాక్టర్ల నుంచి ఇంజినీర్లు డబ్బులు తీసుకునే వారని సమాచారం. అయితే ఇకపై పర్సెంటీజీలకు హితవు పలికి కొందరు ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో కుమ్మకై పనుల్లో పాట్నర్‌షిప్ అడుగుతూ ‘నీ కెంత..నా కెంత’ అని బేరసారాలు కుదుర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. బేరం కుదిరితే ఏ పని చేయాలి, ఆ పనికి టెండర్ ఎంత కోట్ చేయాలి, ఎలా చేయాలి, ఎంత వరకు పని చేయాలి, పనిని ఎలా పెంచుకోవాలని ఇంజినీర్లే కాంట్రాక్టర్లకు దగ్గరుండి సూచనలు చేస్తారని తెలుస్తోంది. ఈ విషయం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ట్రస్ట్‌బోర్డు దృష్టి ఏది?
ఏ పనులు ఎంత మేరకు ఎలా చేయాలో దేవస్థాన ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్య ఇంజినీరు టెక్నికల్ అనుమతులు ఇస్తారు. దేవస్థాన ఈఓ పరిపాలన అనుమతులు ఇస్తారు. అనంతరం ఆయా పనులకు టెండర్లు పిలుస్తారు. భక్తులకు అవసరమైన పనులకే టెండర్లు పిలిచారా.. అనవసరమైన పనులకు పిలిచారా ? అని ఆయా టెండర్లను ట్రస్ట్‌బోర్డు దృష్టిసారించి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశగా ట్రస్ట్‌బోర్డు దృష్టి సారించలేదని సమాచారం.
ఇవీ ఆరోపణలు..
నిర్మాణంలో ఉపయోగించే ఇత్తడి, ఇనుముతో చేసిన సామగ్రి సరఫరా చేసేందుకు టెండర్ వేశారు. ఒకే సామగ్రికి రెండు, మూడు సార్లు టెండర్ పిలిచారు.
టెండర్‌లోని నంబర్ 85లో ట్యూబ్ లెవల్ పైప్ సరఫరా ధర రూ.495, నంబర్ 97లో లెవల్ పైప్ సరఫరా ధర రూ. 455గా పొందుపర్చారు.
ఎస్.నెం.2 టెండర్‌లో మూడు ఇంచుల బాబే నెయిల్స్ ధర రూ.346.96గా, హార్ట్‌వేర్ మెటీరియల్ సరఫరాలో అదే మూడు ఇంచుల బాంబే నెయిల్స్ ధర ఎస్.నెం.4లో రూ.210గా, ఎస్.నెం.42లో రూ.350గా కోట్ చేశారు.
ఎస్.నెం.147 టెండర్‌లో బైండింగ్ వైర్ కట్టర్ 500గా నిర్ణయించారు. అది 500 బైండింగ్ వైర్ కట్టర్‌లా లేక 500 కేజీల బైండింగ్ వైర్ అని అర్థం కాలేదు. ధర రూ.400 కోట్ చేశారు.
ఎస్.నెం.15లో కేజీ బైండింగ్ వైర్ ధర రూ.195గా కోట్ చేశారు. అలాగే చలువ పందిళ్లకు అనుభవం, ఫర్మ్ రిజిస్ట్రేషన్ పొందుపర్చినట్లు తెలుస్తోంది.
ఫ్లైవుడ్ సరఫరా టెండర్‌లోను ధర ఎక్కువగా ఉంది. క్వాలిటీ పొందుపర్చలేదు.
చైన్ లింక్ మెష్ టెండర్‌లో ఇన్ని వేల చదరపు అడుగుల పని చేసిన అనుభవం పొందుపర్చారు.
పేరుకు మాత్రం అన్‌లైన్ టెండర్లు అని దేవస్థాన ఇంజినీర్లు చెబుతున్నారు. ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా చేశారని ఆరోపణలు వచ్చాయి.
కాంట్రాక్టర్లతో కొందరు
ఇంజినీర్ల కుమ్మక్కు
మల్లన్న ఆదాయానికి
గండికొట్టే యత్నం
తమ కాంట్రాక్టర్‌కే పనులు వచ్చేలా
నిబంధనలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల
టెండర్లలో వివరాలు లేని వైనం
టెండర్లపై దృష్టిసారించని
దేవస్థాన ట్రస్ట్‌బోర్డు


