సీఎం చంద్రబాబు రైతు ద్రోహి
నందికొట్కూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దారా సుధీర్ ధ్వజమెత్తారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని పటేల్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దారా సుధీర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు నియోజకవర్గంలోని అన్నదాతలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ రాష్ట్ర, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, పార్టీ నేత బుడ్డా శేషారెడ్డి సంఘీభావం తెలిపారు. రిలే నిరాహార దీక్షలో కూర్చొన్న డాక్టర్ దారాకు, జెడ్పీటీసీలకు, ప్రజా ప్రతినిధులకు, పార్టీ నాయకులకు సాయంత్రం కాటసాని, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
రైతులను విస్మరిస్తే ఉద్యమం ఉద్ధృతం
చంద్రబాబు సర్కారు రైతులను విస్మరిస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ దారా సుధీర్ హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం పంటల బీమా చేయకపోవడంతో రైతులు ఎంతో నష్ట పోయారన్నారు. జగనన్న పాలనలో దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు నష్ట పరిహారం చెల్లించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొక్కజొన్న, ఉల్లి, పొగాకు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మోంథా దెబ్బతో రైతులు నిండా మునిగి గగ్గోలు పెడుతున్నా ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరి కనీసం రైతులను పరామర్శించకపోవడం విడ్డూరమన్నారు. మధ్య దళారులు మొక్కజొన్నను క్వింట రూ.1,500 నుంచి రూ.1,700 వరకు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాన్ కారణంగా చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నా పట్టించుకునేనాథుడే లేరని విమర్శించారు. మొక్కజొన్నకు ఎకరాకు రూ.30 వేలు, కౌలు రూ.15 వేలు, ఉల్లి పంటకు ఎకరాకు రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు నష్టాల పాలైన ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు కల్లిమున్నీసా బేగం, పర్వత యుగంధర్‌రెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, సోమల సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కార్యదర్శి నాగభూషణంరెడ్డి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి జబ్బార్, వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మోమిన్ మన్సూర్, విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధురి, జిల్లా అధ్యక్షులు సురేష్‌యాదవ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌నాయుడు, ప్రధాన కార్యదర్శి తిరుమల్లేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాగార్జునరెడ్డి, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షులు కోకిల రమణారెడ్డి, మండలాల కన్వీనర్లు అశోక్‌రెడ్డి, పుల్యాల నాగిరెడ్డి, లోకేష్‌రెడ్డి, నాగరాజు, సుధాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ, మండల కన్వీనర్ తోకల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతలను ఆదుకోవడంలో
టీడీపీ ప్రభుత్వం వైఫల్యం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారు?
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
దారా సుధీర్ రిలే నిరాహార దీక్షకు
వెల్లువలా సంఘీభావం


