నదీ జలాల పంపిణీలో సీమకు అన్యాయం
నంద్యాల(అర్బన్): శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా, తుంగభద్ర నదీ జలాల పంపిణీలో రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వైఎన్ రెడ్డి మండిపడ్డారు. నదీ జలాల పంపిణీలో సీమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒప్పంద దినం పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత తెలంగాణ విలీనం జరగడంతో రాజధాని హైదరాబాద్‌కు తరలిపోయి.. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజలు గళమెత్తినా చంద్ర బాబు ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేసి సీమకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఏర్వ రామచంద్రారెడ్డి, ఆకుమల్ల రహీం, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


