దర్శనం.. దూరా‘భారం’
మహానంది: మహానందీశ్వరుడి దర్శనానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. కామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామి వార్లను కొందరు ఆర్జిత సేవా టికెట్ల ద్వారా, మరి కొందరు శీఘ్ర, లఘు దర్శనాల ద్వారా, ఇంకొందరు ఉచిత దర్శనం చేసుకుంటారు. సామూహిక అభిషేకం రూ. 1,500, స్పర్శదర్శనం రూ. 150, శీఘ్రదర్శనం రూ. 50, లఘు దర్శనం రూ. 20గా ఆలయ అధికారులు నిర్ణయించి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. అయితే ఆలయ అధికారులు క్షేత్రానికి వచ్చే ఆదాయంపై దృష్టి పెడుతున్నారే కానీ, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనం, రూ. 20 లఘు దర్శనం ద్వారా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. మండపాల్లో ఫ్యాన్లు లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు పడాల్సి వస్తోంది. పేరుకే లఘుదర్శనం టికెట్లు ఇస్తున్నారని, ఉచితం ఇదీ రెండు ఒకటే అవుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. గంటల తరబడి వేచి ఉంటే కనీసం భక్తులకు ఫ్యాన్లు ఏర్పా టు చేయలేరా..? అంటూ భక్తులు అసహనం వ్యక్తం చేశారు. రూ. 20, రూ. 50, ఉచిత క్యూలైన్ల ద్వారా అంత కష్టపడి ఆలయంలోకి వస్తే మహానందీశ్వ రుడి దర్శనం కనులారా చూసే భాగ్యం కూడా లేదని, దూరం నుంచే పంపించేయడం ఏంటనీ పలువు రు నిరాశ చెందుతున్నారు. టికెట్లలో వ్యత్యాసం ఉన్నా దర్శనం అంతా ఒకటేనని వాపోయారు.
వృద్ధులు, వికలాంగులకు ఏర్పాట్లేవి..
మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులను స్వామి గర్భాలయం వద్దకు వచ్చే సమయంలో స్వామివారికి దగ్గరగా నంది ముందు నుంచి పంపేవారు. వారిలో వృద్ధులు, వికలాంగులు ఉంటారు. అయితే భక్తులరద్దీ పేరుతో స్వామివారి గర్భాలయం ముందు ఉండే హుండీని అడ్డుగా పెట్టేసి మహానందీశ్వరస్వామి దర్శనాన్ని భక్తులకు దూరం చేశారు. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉండటం సహజం. మహానందిలో మాత్రం పుట్టాకారంలో ఉండటంతో దూరం నుంచి చూసే భక్తులకు మహానందీశ్వరుడు రూపాన్ని పూర్తిగా దర్శించుకోలేక పోతున్నారు. దీంతో ఓం నమఃశివాయ అనుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తోంది. అలాగే సేవ పేరుతో వచ్చిన వారు గుంపులు గుంపులుగా ఒకటే చోట ఉండటం గందరగోళం నెలకొంటుందని కొందరు భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారినైనా దగ్గర నుంచి చూసే భాగ్యం కల్పిస్తారనుకుంటే అక్కడా దూరం నుంచే చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆదివారం నంద్యాలకు చెందిన భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లాంటి క్షేత్రంతో పాటు ఏ ఆలయానికి వెళ్లినా వృద్ధులు, వికలాంగులకు కాస్త మినహాయింపు, ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కానీ మహానందిలో ఎలాంటి ఏర్పాట్లు లేవు. అఽధికారులు ఇప్పటికై నా స్పందించి భక్తుల ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
మహానంది క్షేత్రంలో శీఘ్ర,
లఘు దర్శనాలపై భక్తుల విమర్శలు
స్వామి దర్శనంలో
సాధారణ భక్తులకు ఇక్కట్లు
వృద్ధులు, దివ్యాంగులకు కనిపించని
ప్రత్యేక ఏర్పాట్లు


