మల్లన్న సేవలో జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డా.చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదపండితులు వేదగోష్టి నిర్వహించగా, దేవస్థాన ఈఓ శేషవస్త్రాలు బహుకరించి సత్కరించారు. పీఠాధిపతి అధికారులకు, అర్చకులకు, వేదపండితులకు అనుగ్రహభాషణం చేశారు.
ఓవర్ లోడ్ వాహనాలను సీజ్ చేస్తాం
నంద్యాల(న్యూటౌన్): ఓవర్ లోడ్ వాహనాలను సీజ్ చేసి లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌టీఓ కార్యాలయంలో గ్రావెల్ రవాణా చేస్తున్న టిప్పర్, గనుల యజమానులతో జిల్లా రవాణా శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీఓ మాట్లాడుతూ.. ఓవర్ లోడ్‌ఓవర్, ఓవర్ స్పీడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డస్ట్, మెటల్ గ్రావెల్ తరలింపు సమయంలో తప్పనిసరిగా టార్పల్ కట్టుకొని రవాణా చేయాలన్నారు. రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గత మూడు రోజుల్లో ఏడు వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3.22 లక్షలు జరిమానా విధించామన్నారు. ఈ సమావేశంలో మైనింగ్ అధికారి వేణుగోపాల్, మోటారు వాహన తనిఖీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
25 లోపు ‘పది’ పరీక్షల ఫీజు చెల్లించాలి
నంద్యాల న్యూటౌన్: పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 25వ తేదీలోపు చెల్లించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువులోపు ఫీజు చెల్లించాలని, రూ.50 రుసుంతో వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ.200 రుసుంతో వచ్చే నెల 10వ తేదీ, రూ.500 రుసుంతో డిసెంబరు 15వ తేదీలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ తేదీల్లో సాధారణ సెలవులు ఏవైనా ఉన్నట్లు అయితే ఆ మరుసటి రోజు కూడా చెల్లించవచ్చునని తెలిపారు. పూర్తి వివరాలకు www. bseap.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
డిజిటల్ విధానంలో పన్ను చెల్లింపు
చాగలమర్రి: గ్రామ పంచాయతీల్లో ఇంటి, కుళాయి, ఇతర పన్నుల చెల్లింపులకు డిజిటల్ విధానంలో స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని నంద్యాల డీఎల్‌పీఓ రాంబాబు తెలిపారు. గొడిగనూరు గ్రామ పంచాయతీని ఆయన గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పన్నులను డిజిటల్ పేమెంట్ చేయడంతో ఇంటి యజమానుల మొబైల్ ఫోన్‌కు మేసేజ్ వస్తుందన్నారు. సమావేశంలో సర్పంచ్ సంజీవరాయుడు, ఎంపీడీఓ తాహెర్ హుస్సేన్, ఈఓ తారకేశ్వరి, కార్యదర్శి రాజశేఖర్, పంచాయితీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్‌ఏ–1 పరీక్ష వాయిదా
కర్నూలు సిటీ: బాలల దినోత్సవం సందర్భంగా నేడు(శుక్రవారం)జరగాల్సిన ఎస్‌ఏ–1 పరీక్షను వాయిదా వేశారు. వాయిదా వేసిన పరీక్షను 1వ తరగతి నుంచి 5తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 20వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పత్రాలను సురక్షితంగా భద్ర పరచాలని, ఎట్టి పరిస్థితుల్లోను తెరవకూడదని పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మల్లన్న సేవలో జగద్గురు పీఠాధిపతి


