
ఇంకెప్పుడు న్యాయం చేస్తారు?
కోవెలకుంట్ల: ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్న సుగాలి ప్రీతి కుంటుంబానికి ఇంకెప్పుడు న్యాయం చేస్తారని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ కూటమి సర్కారును ప్రశ్నించారు. 2017లో ఒక ప్రైవేట్ రెసిడెన్సియల్ పాఠశాలలో హత్యకు గురైన సుగాలి ప్రీతి కేసులోని దోషుల్ని శిక్షించాలని ఆ బాలిక తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘14 ఏళ్ల బిడ్డ ప్రీతి స్కూల్‌కెళితే 10 మంది కలిసి నాశనం చేస్తే ఎవరూ పట్టించుకోలేదని, సగటు మనిషికి కష్టమొస్తే తనకు ఏడుపొస్తోంది’ అని అప్పట్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏవేవో మాటలు చెప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసును స్వీకరిస్తామని పవన్ గొప్పలు చెప్పారన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా ఆ కేసు విషయం అతీగతి లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ప్రీతి తల్లి పార్వతీదేవి విజయవాడకు వెళ్లి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసిందన్నారు. హోమంత్రి అనితను కలవాలని ఉచిత సలహా ఇవ్వగా హోమంత్రితోపాటు మరో మంత్రి నాదేండ్ల మనోహర్‌ను కలిసినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మరోవైపు ప్రీతి తల్లి అంగవైకల్యంతో బాధపడుతూ తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి సర్కారు సుగాలి ప్రీతి కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఎనిమిదేళ్లుగా సుగాలి ప్రీతి
కుటుంబం పోరాటం
వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి శ్రీనివాస్ నాయక్