
నేర నియంత్రనే లక్ష్యంగా పని చేయాలి
నంద్యాల: శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రనే లక్ష్యంగా పని చేయాలని జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్ డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో వారి వారి పోలీస్ స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేర పరిశోధన, న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. రాబో యే వినాయక చవితి పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా నిఘా పెంచాలన్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే పాత నేరస్తులను బైండోవర్ చేయాలన్నారు. వినాయక ఉత్సవ కమిటీ, పీస్ కమిటీతో సమావేశాలు నిర్వహించి శాంతియుత వాతావరణం కల్పించాలన్నారు. స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల సమాచారం తప్పక ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పా టు చేయాలన్నారు. అధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్స్, బారికేడ్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీలు ప్రమోద్ కుమార్, రామంజి నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.