
హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా
కర్నూలు: హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహన రికార్డులు లేకపోయినా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అడ్డగించి భారీగా జరిమానాలు విధించారు. దాదాపు 150 మంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పు న రూ.1.50 లక్షల అపరాధ రుసుం విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులను ఆపి అరగంట పాటు సమయమిచ్చి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత వారికి రోజా పుష్పం ఇచ్చి వాహనాలను అప్పగించారు. ఇకపై హెల్మెట్ లేకుండా నడిపే వ్యక్తులను ఉపేక్షించేది లేదని సీఐ మన్సూరుద్దీన్ హెచ్చరించారు.