‘తల్లీబిడ్డ’కు అనారోగ్యం! | - | Sakshi
Sakshi News home page

‘తల్లీబిడ్డ’కు అనారోగ్యం!

Aug 18 2025 5:39 AM | Updated on Aug 18 2025 5:39 AM

‘తల్లీబిడ్డ’కు అనారోగ్యం!

‘తల్లీబిడ్డ’కు అనారోగ్యం!

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

గోస్పాడు: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఇళ్లకు చేర్చే వాహనాలకు ‘చంద్ర’ గ్రహణం పట్టింది. వివిధ సమస్యలతో వాహనాలు షెడ్లకు పరిమితమైనా రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదు. అరకొర జీతాలు సరిపోక డ్రైవర్ల ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. నంద్యాల జిల్లాలో 19 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి మాతా, శిశు విభాగానికి 6, డోన్‌కు 3, ఆళ్లగడ్డకు 2, శిరివెళ్ల, ఆత్మకూరు, బనగానపల్లె, వెలుగోడు, నందికొట్కూరు, బేతంచెర్ల, కోవెలకుంట్ల, శ్రీశైలం ప్రాంతాల్లోని ఆసుపత్రులకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.

ఇవీ ఇబ్బందులు..

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల నిర్వహణ (మెయిన్‌ంటెనెన్స్‌) సక్రమంగా లేదు. ఇంజిన్‌ ఆయిల్‌, బ్యాటరీలు తరచూ మార్చకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. టైర్లు అరిగిపోవడంతో పంక్చర్‌ అవుతూ ఎక్కడ నిలిచి పోతాయో తెలయక డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. వాహనంలో వైఫర్లు, బ్యాటరీలు, లైట్లు కూడా సక్రమంగా పనిచేయని దుస్థితి నెలకొంది.

సేవలు కుదింపు

● గతంలో ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు కూడా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల సేవలు అందించేవారు. రెండు నెలలుగా ఈ సేవలను ఆపేశారు.

● గతంలో 50 కిలోమీటర్ల నుంచి 100, 150 కిలోమీటర్ల వరకు తల్లీబిడ్డ వాహనం వెళ్లేది. ఇటీవల 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు కుదించారు.

● ఒక తల్లి, బిడ్డ, వారి సాయంగా ఉన్న ఒకరిని మాత్రమే గమ్య స్థానానికి తీసుకెళ్లాలి. ఫలితంగా తల్లులు అవస్థలు పడుతున్నారు.

● తల్లికి ఒక చోట, పుట్టిన బిడ్డకు మరో చోట చికిత్స అందించాల్సి ఉంటుంది. అత్యవసర చికిత్స అందించేందుకు దూరప్రాంతాల ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తే అక్కడ కోలుకున్నాక డిశ్చార్జ్‌ చేసిని వారిని తిరిగి ఇళ్లకు చేర్చడం లేదు. దీంతో చేసేది లేక తల్లీబిడ్డలు వారి ఆర్థిక స్తోమతను బట్టి ప్రైవేట్‌ వాహనదారులను, ఆటోలను ఆశ్రయిస్తూ ఇళ్లకు చేరుతున్నారు.

డ్రైవర్ల వేతనాల చెల్లింపులో అలసత్వం

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల్లో పనిచేస్తున్న 21 మంది డ్రైవర్లకు నెలకు రూ.7,870 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ఈ మొత్తం కూడా నెలనెలా చెల్లించడం లేదు. వాటి చెల్లింపులోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నాలుగు నెలలకు గాను రెండు రోజుల క్రితం రెండునెలల వేతనాన్ని చెల్లించారు. బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే వారు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వేతనాలు రాని కారణంగా కుటుంబ పోషణ కష్టంగా మారిందని డ్రైవర్లు వాపోతున్నారు.

వాహనాలకు బాగాలేని టైర్ల విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తల్లీబిడ్డల సేవలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

–నవీన్‌కుమార్‌, జిల్లా మేనేజర్‌

జిల్లాలో 19 వాహనాలతో సేవలు

టైర్లు అంతంత మాత్రమే

ఎక్కడ నిలిచిపోతాయో

తెలియని దుస్థితి

డ్రైవర్లకు సకాలంలో

అందని వేతనాలు

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

మెరాయింపు ఇలా..

జిల్లాలోని 19 వాహనాల్లో వైఫర్‌ బ్లేడ్లు లేవు. వర్షాకాలం కావడంతో వాహనాలు బయటికి వెళ్లిన సమయంలో ఉన్నట్లుండి వర్షం వస్తే వాహనం ముందుకు కదల్లేదు.

పది వాహనాలకు టైర్లు దెబ్బతిన్నాయి. స్టెప్నీ టైర్లు కూడా లేదు. గత రెండు రోజులుగా బనగానపల్లె వాహనం నిలిపోయింది.

గత 20 రోజుల క్రితం నంద్యాల, వెలుగోడులలో వాహనాలు నిలిచిపోయాయి. టైర్లు వచ్చేవరకు తిరగలేని పరిస్థితి.

కోవెలకుంట్లలోని వాహనానికి బ్యాటరీ లేక దాదాపుగా తొమ్మిది నెలలు గడుస్తోంది.

గతంలో వాహనాలకు డీజిల్‌ కొరత ఉండేది కా దు. ప్రస్తుతం నెలకు రెండు ఫుల్‌ ట్యాంకులు దా టితే ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement