
ఆటోలపై ‘కూటమి పిడుగు’
కొలిమిగుండ్ల: డ్రైవింగ్ వచ్చి ఆటో చేతిలో ఉంటే చాలు కుటుంబాన్ని పోషించుకోవచ్చనే ధీమాతో ఉన్న వారు ఇప్పుడు డీలా పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సీ్త్రశక్తి పేరిట ఉచిత బస్సు పథకం సాఫీగా సాగిపోతున్న ఆటోవాలా జీవన ప్రయాణంపై పిడుగులా పడింది. ఇప్పటికే ఇంటికో బైక్, కారు ఉండటంతో ఆటోలు ఎక్కే వారి సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఫ్రీ బస్సు ఏర్పాటుతో ఆటో డ్రైవర్లు మరింత కష్టాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు ఆటో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలిమిగుండ్ల మండలంలో 150కి పైగానే మూడు, నాలుగు చక్రాల ఆటోలు ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తూ రోజుకురూ. 500 నుంచి రూ. 700 మేర సంపాదిస్తుండేవారు. ఆటోల్లో ఎక్కువ భాగం మహిళలే ప్రయాణించే వారు. రెండు రోజుల నుంచి ఆటోలు ఎక్కే వాళ్లు లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉచిత బస్సు పథకంతో తమ బతుకు బండి నడిచేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు సర్వీసులు లేని గ్రామాల్లో మాత్రమే కొంత వరకు మహిళలు ఆటోల్లో వెళుతున్నారని చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాహనమిత్ర పథకం కింద ఏటా రూ.10 వేలు అకౌంట్లలో జమ కావడతో కొంత వరకు ఊరట కలిగించిందన్నారు. ఆ డబ్బుతో వాహనాల ఆటోల ఫిటెనెస్, బీమా ఇతర అవసరాలకు ఉపయోగించుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో వాలాలకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, 14 నెలలు అవుతున్నా ఆ ఊసేత్తడం లేదన్నారు. కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారిందని, ఆటోవాలాలకు చేయూత ఇవ్వాలని కోరుతున్నారు.
ఉచిత బస్సుతో ఆటోవాలా
జీవనోపాధిపై ప్రభావం
రూ. 15 వేల హామీ
అమలు చేయాలని డిమాండ్