
బానకచర్ల నుంచి 26 వేల క్యూసెక్కులు విడుదల
పాములపాడు: బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి 26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నుంచి ఎస్‌ఆర్‌ఎంసీ ద్వారా 26,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు. తెలుగుగంగ (వీబీఆర్)కు 11,000, జీఎన్‌ఎస్‌ఎస్‌కు 12,000, కేసీసీ ఎస్కేప్ చానల్‌కు 3,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు వివరించారు.
శ్రీశైలం మెడికల్ ఆఫీసర్ సస్పెన్షన్
గోస్పాడు: విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న శ్రీశైలం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షహనాజ్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ శుక్రవారం తెలిపారు. ఇటీవల సీఎం శ్రీశైలం పర్యటన సందర్భంగా డాక్టర్ షహనాజ్ విధులకు గైర్హాజరు కావడంతో పాటు తరచూ విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ రోగులకు అందు బాటులో ఉండటం లేదన్నారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారించిన అనంతరం ఈ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. వారి ఆదేశాల మేరకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షహనాజ్‌ను సస్పెండ్ చేశామన్నారు.
మహానందిలో మహాలక్ష్మీ హోమాలు
మహానంది: శ్రావణమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో మహాలక్ష్మి హోమాలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు స్థానిక యాగశాలలో మహాలక్ష్మీ హోమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల భక్తులు ఆర్జిత సేవా టికెట్ల ద్వారా హోమంలో పాల్గొన్నారు. హోమాల అనంతరం భక్తులకు శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వారి ప్రసాదాలు అందించారు. శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి నెమలి పింఛములతో అలంకరణ చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు అమ్మవారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారి అలంకరణ చూసి మంత్రముగ్ధులయ్యారు. శ్రావణమాసం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. స్థానిక కల్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి యాగశాలలో మహానందీశ్వరుని దంపతులకు ఏకాంత సేవ పూజలతో దర్శనం సేవలు ముగిశాయి.
ముగిసిన మొహర్రం
సంతాప దినాలు
బనగానపల్లె: మొహర్రం సంతాప దినాలు శుక్రవారంతో ముగిశాయి. మొహర్రం వేడుకలు గత నెల 6వ తేదీ పీర్ల నిమజ్జనంతో ముగిసింది. అప్పటి నుంచి షియా మతస్తులు 40 రోజుల పాటు సంతాప దినాలుగా భావిస్తారు. మతసామరస్యానికి ప్రతీక అయిన మొహర్రాన్ని బనగానపల్లెలో షియా మతస్తు లు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. శుక్రవారం మొహర్రం సంతాప దినాలు ముగియడంతో కొండపేటలోని పీర్లచావిడి నుంచి బయల్దేరిన ఇమాంహసన్, ఇమాంహుస్సేన్ పీర్లతో భక్తిగీతాలు అలపిస్తూ మాతం నిర్వహిస్తూ రక్తాన్ని చిందించారు. ఈ మాతం కార్యక్రమం పాత సిండికెట్ బ్యాంకు వరకు సాగింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక ఆస్థానం నుంచి బనగానపల్లె నవాబు వంశీయులు మీర్‌ఫజల్ అలీఖాన్‌తో పాటు షియా మతస్తులు పాల్గొని మాతం చేసుకుంటూ నవాబు కోట వరకు వెళ్లారు. కార్యక్రమంలో పలువురు షియా మత పెద్దలతో షీయా మతస్తులు పాల్గొన్నారు. మాతం చూసేందుకు అధిక సంఖ్యలో హిందూ, ముస్లింలు తరలివచ్చారు.

బానకచర్ల నుంచి 26 వేల క్యూసెక్కులు విడుదల

బానకచర్ల నుంచి 26 వేల క్యూసెక్కులు విడుదల