
మత్స్యకారుల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు
● వైఎస్సార్‌సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్
కర్నూలు(టౌన్): కార్పొరేషన్ పదవుల పేరుతో కూటమి ప్రభుత్వం మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెడుతుందని వైఎస్సార్‌సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇటీవల 31 కార్పొరేషన్ పదవులను ప్రకటించిందన్నారు. అయితే, నిజమైన కులాలకు కాకుండా బెస్తయేతర వారికి ఆ పదవులు కట్టబెట్టి చిచ్చురాజేసిందన్నారు. బెస్త సంక్షేమ, అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్‌గా పట్టపు సామాజిక వర్గానికి చెందిన బొమ్మన శ్రీధర్‌ను ప్రకటించి నిజమైన బెస్త సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. పట్టపు రాజు లేదా పట్టపు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయ నకు బెస్త కార్పొరేషన్ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సీమలో ఫ్యాక్షన్‌కు బలి అవుతున్న బెస్తలకు కనీసం కుల కార్పొరేషన్ పదవుల కేటాయింపులో కూడా న్యాయం జరగలేదన్నారు. అలాగే గత జులై నెల 7 వ తేదీ న జీవో 81 ప్రకారం కొల్లు పెద్దిరాజును మత్య్సకార కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రకటించారన్నారు. పదవుల విషయంలోనే కాకుండా మత్స్య కార సమస్యలు పరిష్కారంలోనూ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బెస్తలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేకపోతే భవిష్యత్తులో వారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.